Vaddepally School | రాయపోల్, జనవరి 18 : విద్యార్థులకు ఆధునిక బోధన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పాఠశాలకు టీవీ, సోలార్ విద్యుత్ అందించడం అభినందనీయమైన పరిణామమని వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రాజా గారి రేణుక పేర్కొన్నారు. ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సహకారంతో 96 ఇంచుల టీవీతోపాటు సోలార్ ప్లాంటుకు సంబంధించిన పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ అందడంతో ఇకపై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని, దీంతో విద్యార్థులు డిజిటల్ బోధనను సులభంగా పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన సాగితే విద్యార్థుల ప్రతిభ మరింత మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
పాఠశాల అవసరాలను గుర్తించి టీవీ, సోలార్ ప్లాంటు అందించిన ఎంపీ రఘునందన్ రావుకు వడ్డేపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కరుణాకర్, నర్సింలు, సీఆర్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.