MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక, మార్చి 27 : గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు కొనసాగుతున్నాయి. మద్యం సేవించి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ శాసనసభలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు.
దుబ్బాక నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని, దుకాణాల నిర్మూలనకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గ్రామాలలోకి వెళ్లినపుడు తనతో మహిళలు బెల్టు దుకాణాల గురించి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నారని, యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా.. మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తమతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
యధేచ్చగా బెల్టు దుకాణాలు నిర్వహించడంతో పల్లెల్లో 24 గంటలు మద్యం ఏరులై పారుతుందన్నారు. దీంతో చాలా మంది మద్యానికి వ్యసనపరులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో గొడవలకు దిగి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విన్నవించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని గొప్పగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా గ్రామాల్లో బెల్టు దుకాణాలను నిర్మూలిస్తే చాలని ఎమ్మెల్యే కోరారు.
కూడవెల్లి వాగు వంతెనపై ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి :
దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగుపైన వంతెనతోపాటు ఆర్అండ్బీ రోడ్డు నిర్మించాల్సి ఉందని, మిరుదొడ్డి, తొగుట రెండు మండలాల ప్రజలతోపాటు ప్రయాణీకులకు ప్రధాన సమస్యగా మారిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి అల్వాల్-మెట్టు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో సమస్యగా మారిందన్నారు.
ఆ రెండు గ్రామాల మధ్యన కూడవెల్లి వాగు ప్రవాహం ఉంటుందని, వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు పిల్లర్లు సైతం నిర్మించారని, 2017లో ల్యాండ్ ఇష్యూ కారణంగా వంతెన నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయినట్లు తెలిపారు. ఇపుడు ల్యాండ్ ఇష్యూ తొలిగిపోయినందున.. ఆ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి, సమస్య పరిష్కరించాలని కోరారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!