మహబూబ్నగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతనో మాజీ సర్పంచ్.. అతడి భార్య ప్రస్తుత సర్పంచ్.. ప్రజలను కంటికి రెప్పలా.. బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత వారిది. కానీ పదవి వచ్చిందన్న అహమో లేక అధికార పార్టీలో ఉన్నామన్న ధీమానో.. ఏమో.. విచక్షణ మరిచారు. గ్రామ సమస్యను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ ఇలాకా.. నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కోస్గి మండలం సర్జాఖాన్పేటలో ఓ ఇంటి దగ్గర నిర్మిస్తున్న ఇంకుడు గుంతను యజమాని అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని గ్రామ వాట్సాప్ గ్రూపులో స్థానికులు చర్చకు దిగారు.
ఇది ముమ్మాటికీ అక్రమమే అని బీఆర్ఎస్ కార్యకర్త బాలరాజు ప్రశ్నించాడు. దీంతో గ్రూపు సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. బుధవారం ఉదయం తన ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో బాలరాజు నిలబడి ఉండడాన్ని గమనించిన మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ మౌనిక భర్త హరీశ్గౌడ్ అతడి వద్దకు వెళ్లి పోస్టు విషయమై నిలదీశాడు. అతడితోపాటు హరీశ్ అనుచరులు, మరో 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అతడి వద్దకు వెళ్లి బెదిరించారు. అనంతరం తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడి చేశారు. భయంతో అక్కడి నుంచి తప్పించుకొన్న బాలరాజు సమీపంలోని స్కూల్ భవనంపైకి ఎక్కి కిందికి దూకి పరారయ్యాడు.
ఈ క్రమంలో అతడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయితే కోస్గి ప్రభుత్వ దవాఖానకు అతడిని బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లగా.. అక్కడ స్కానింగ్ లేకపోవడంతో ప్రైవేటు దవాఖానను ఆశ్రయించారు. అంతకుముందు కూడా బాలరాజు ఇంటి వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగారని తెలిసింది. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, దౌర్జన్యాలే పాలనగా తమ పరిపాలనను కొనసాగిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి కొడంగల్లో దగా పాలనకు తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ దౌర్జన్యం, అరాచక పర్వానికి తెరలేపిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అధికారం మారితే కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా ఏంటో అర్థం చేసుకుని నడుచుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని, అధికార పార్టీ ఆగడాలుమాని అభివృద్ధి చేసి చూపించాలని బీఆర్ఎస్ గ్రామ నేత రాజు హితవుపలికారు. సర్జఖాన్ పేటలో బీఆర్ఎస్ కార్యకర్త బాలరాజుపై జరిగిన దాడి జరగడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.