జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు జర్నలిస్టు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముకిరాల మధు వంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ ఆదివారం రాత్రి తన ఇంట్లోకి వచ్చి మా పైనే వార్తలు రాస్తావారా..? మాదిగ లంజాకొడకా..? అంటూ తన కులం పేరుతో దూషిస్తూ తనపై పిడుగులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారన్నారు.
తన భార్య కళావతి కాంగ్రెస్ నాయకుల దాడిని ఆపే ప్రయత్నం చేయగా, కళావతి నోరు, ముక్కు మూసి తన భార్యను సైతం చంపే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన జర్నలిస్టు రవీందర్ ను ఆయన బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని 100 పడకల దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రవీందర్ ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించి, రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గంట సత్యనారాయణ రావు అండదండలతోనే జర్నలిస్టు రవీందర్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.