Marjorie Taylor Greene : ఇరాన్-అమెరికా (Iran-US) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కాంగ్రెస్ (America Congress) మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ (Republican Party) నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ (Marjorie Taylor Greene) సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను నియంత్రించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బయటకు చెప్తున్నప్పటికీ.. ఇరాన్‌పై అణుదాడులు (Nuclear Strikes) ప్రారంభించడానికి రహస్యంగా సన్నద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.
త్వరలో ఈ అణుదాడులు చేయడానికి ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందని ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అణుదాడులవల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ఆయన చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలను ప్రయోగించిన విషయాన్ని టేలర్ గ్రీన్ గుర్తుచేసుకున్నారు.
ఇన్నేళ్లు గడిచినా జపాన్ ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ వ్యాధులు, క్యాన్సర్, పుట్టుకతో సంక్రమించే లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే పరిస్థితి ఇరాన్‌కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యుద్ధం జరుగుతున్నంత కాలం ప్రజలు భయపడుతూనే జీవించాల్సి ఉంటుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామీ పేర్కొన్నారు. ఈ పరిస్థితులు తొలగిపోయి శాంతియుత వాతావరణం నెలకొనేలా దౌత్య విధానాలను అవలంభించాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇన్నాళ్లు బాహ్య ఒత్తిడిని తట్టుకొని ప్రభుత్వం నిలబడినప్పటికీ యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతవరకు ఇరాన్ కూడా వాటిని సమకూర్చుకుంటూనే ఉంటుందని ఆ దేశ సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిది పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.