పటాన్చెరు, మార్చి 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మార్చుకొని ట్యాంకర్ల ద్వారా నీటి దందా సాగిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లకు నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
కాలనీల్లో, అపార్టుమెంట్లలో బోర్లు ఎండిపోతుండడంతో ట్యాంకర్లే దిక్కుగా మారాయి. పటాన్చెరు పారిశ్రామికవాడ సమీపంలోని గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితం కావడంతో వాటిని ఎవరూ వాడడం లేదు. పరిశ్రమలు సైతం ఆ నీటిని ఉపయోగించడం లేదు. ఈ నేపథ్యంలో కలుషితం కాని బోర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతున్నది. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో ఏ ధరనైనా పెట్టి నీటి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం సరఫరా చేసే నల్లా నీరు రాకపోవడంతోపాటు, బోర్లు ఎండిపోయి మధ్య, పేద తరగతి వర్గాలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనడం తలకుమించిన భారంగా మారుతున్నది. నీటి ట్యాంకర్లకు డిమాండ్ పసిగట్టిన కొందరు నాయకులు, వ్యాపారులు బాగా నీటిని పోస్తున్న బోర్లను గుర్తించి రైతుల వద్ద లీజుకు తీసుకొని దందా సాగిస్తున్నారు. వేసవిలో నీటి సరఫరాకు డిమాండ్ ఉంటుందని గ్రహించే నాయకులు, వ్యాపారులు లోపాయికారిగా నీటి సరఫరా చేసే వ్యవస్థలను నాశనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు నీరందకుండా చూడడంతోనే నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడి వారు చెప్పిందే రేటుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
వారంలో ఒకరోజు మాత్రమే నీటి సరఫరా
పటాన్చెరు నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, జలమండలి, మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా పట్టణాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథలో గ్రిడ్ మెయిన్ లైన్ల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంట్రా ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ నీటి సరఫరా కొనసాగుతున్నది. ఇప్పుడు ఇంట్రాను తప్పించి ఆ బాధ్యతలను పంచాయతీలకు ప్రభుత్వం అప్పగించింది. రింగు రోడ్డు లోపల ఉన్న పట్టణాలు, గ్రామాలకు జలమండలి ద్వారా తాగునీరు అందజేస్తున్నారు. మున్సిపాలిటీల్లోని నీటి సరఫరా విభాగం ఇంటింటికీ నీరందేలా చర్యలు తీసుకుంటుంది.
ఇప్పుడు వేసవిలో పైపులు పగలడం, రోడ్డు విస్తరణ పనుల కారణంగా పైపులకు మరమ్మతులు తలెత్తుతుండడంతో చాలా గ్రామాల్లో వారంలో ఒకరోజు మాత్రమే నీరు సరఫరా అవుతున్నది. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందని ద్రాక్షగా మారుతున్నది. ఇప్పటికే అధికశాతం బోర్లు ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటి గృహాల్లోని బోర్ల నుంచి నీరు రావడం లేదు. ఇది వ్యాపారులకు వరంలా మారింది. ట్రాక్టర్ ట్యాంకర్లు, లారీ ట్యాంకర్లు, పెద్ద లారీ ట్యాంకర్లతో నీటిని అమ్ముతున్నారు. ఫోన్ చేసి వ్యాపారులను బతిమాలితే నీటిని పంపుతున్నారు.
అక్రమ బోర్లను సీజ్ చేస్తాం..
సంగారెడ్డి జిల్లాలో నీటి వ్యాపారం చేసే బోర్లను గుర్తిస్తాం. అనుమతులు లేని బోర్ల లిస్టును తయారు చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి బోర్లను సీజ్ చేయడంతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు పెడతాం. పటాన్చెరు ప్రాంతం ఇప్పుడు సెమీ సేఫ్జోన్లో ఉంది. వేసవిలో చర్యలు తీసుకోకుంటే రెడ్‌జోన్‌లోకి వెళ్తుంది. బోర్లతో నీటిని తోడటంపై నిఘా పెడుతున్నాం. భూగర్భ జలాలు రెడ్‌జోన్‌లో రాకుండా చర్యలు తీసుకుంటాం. మండలాల వారీగా భూగర్భ జలాల శాతం లిస్టు తయారైంది.
– జి.నర్సింహులు, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్
పరిశ్రమల్లో విపరీతమైన డిమాండ్
నియోజకవర్గంలోని పటాన్చెరు, బొల్లారం, బొంతపల్లి, గడ్డపోతారం, పాశమైలారం, కాజీపల్లి, రుద్రారంలలో ఇండస్ట్రియల్ ఎస్ట్టేట్స్ ఉన్నాయి. ఫార్మా, కెమికల్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలకు నిరంతరం సురక్షితమైన నీరు అవసరం. నీటిని ఏడాదంతా సరఫరా చేసేందుకు స్థానిక నాయకులు, వ్యాపారులు కాంట్రాక్టు పొందారు. ఆరునూరైనా ఒప్పుకున్న సంఖ్యలో నీటి ట్యాంకర్లను రోజూ పంపాల్సి ఉంటుంది. వేసవిలో ట్యాంకర్లకు రెట్టింపు డిమాండ్ ఏర్పడుతుంది.
పరిశ్రమలకు నీటిని అందజేసేందుకు వ్యాపారులు రైతుల వ్యవసాయ బోర్లను సైతం లీజుకు తీసుకుంటున్నారు. అమీన్పూర్, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్, బొల్లారం, కాజీపల్లి, ముత్తంగి, కర్ధనూర్, నందిగామ, క్యాసారం, ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారంలలో అక్రమంగా నీటిని తోడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్లో, హోటళ్లలో, హాస్టళ్లలో నీటికి బాగా డిమాండ్ ఏర్పడింది. వీరికి కూడా సకాలంలో నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గృహాల్లో, అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో, పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో బోర్లు ఎండిపోయి నీటికి డిమాండ్ ఏర్పడడంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఇప్పటికే 50శాతం ధరలు వ్యాపారులు పెంచినట్లు సమాచారం. ఇప్పుడు ఈ రేట్లు ఉంటే ఏప్రిల్, మేలో ధరలు ఎంత వసూలు చేస్తారోనని ప్రజలు భయపడుతున్నారు. భూగర్భ జలశాఖ ఎన్వోసీ ఉన్నా వ్యాపారులు మాత్రమే నీటి దందా చేయాల్సి ఉంటుంది. అనుమతులు పొందినవారు వేళ్లమీద లెక్కించవచ్చు. అక్రమ నీటి తోడకంపై అధికారుల నియంత్రణ కరువై నీటి ట్యాంకర్ల దందా పుంజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ట్యాంకర్లతో నీటిని కొనే పరిస్థితి ఏ రోజూ రాలేదని, ఇప్పుడు మళ్లీ నీటిని కొంటున్నామని ప్రజల వాపోతున్నారు. అధికారులు నీటి వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.