MLA Harish Rao | గజ్వేల్, ఏప్రిల్ 13: ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మందిని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పాట్లు చేపడుతున్నామని అందుకు భిన్నంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని రాష్ట్ర మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.
ఆదివారం గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 నుండి 2014 వరకు హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో అనేక సభలను నిర్వహించుకున్నాం. కానీ ఈ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని అందుకు ప్రతి కార్యకర్త సమయానికి ప్రాంగణానికి చేరుకొని కేసీఆర్ స్పీచ్ విని జై తెలంగాణ అన్న తర్వాతనే అక్కడి నుండి ఇంటికి చేరుకోవాలన్నారు.
క్రమశిక్షణ కలిగిన ఉద్యమకారులమని అదే క్రమశిక్షణతో సభకు చేరుకొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో విద్యార్థి, యువత, కుల సంఘాల వారిని కలిసి రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసిన ప్రతీ అంశంపై చర్చ పెట్టాలన్నారు. ఎంత స్పీడుగా కాంగ్రెస్ గెలిచిందో అంతే స్పీడుగా అవుట్ అయిందని ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కుదవ పెడదామన్నా పైసా పుట్టని పరిస్థితి..
రేవంత్ రెడ్డి రాకతో మార్కెట్లో రూపాయి దొరుకుతలేదని అన్ని వర్గాల వ్యాపారాలకు దెబ్బపడిందని ఎవరిని కదిలించినా పరేషాన్లో ఉన్నారన్నారు. కొడుకో, కూతురుకో పెళ్లి చేద్దామంటే ఉన్న ఇల్లు కుదవ పెడదామన్నా ఎక్కడ పైసా పుట్టని పరిస్థితి ఉందన్నారు. ప్రజలు రేవంత్ పాలనపై విసిగిపోయారని గజ్వేల్లో 20 వేల మందికి ఇంకా రుణమాఫీ కాలేదన్నారు.
చిన్నకోడూర్ మండలంలో 5100 మందికి రుణమాఫీ అయితే 7300 మందికి రుణమాఫీ కాలేదన్నారు. గ్రామాల్లో కేసీఆర్ హయాంలో ప్రతీ కులానికి కమ్యూనిటీ హాల్లో నిర్మాణం చేపట్టామని అందరినీ కలిసి సభకు తీసుకురావాలన్నారు. జూన్, జూలైలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతాయని ఈ సభకు వచ్చిన వారు కేసీఆర్ ప్రసంగం వింటే అంతే ఉత్సాహంతో పని చేస్తారన్నారు. నియోజకవర్గం నుండి 15 వేల మంది టార్గెట్ అయితే అంతకుమించి సభకు ప్రజలను తరలించాలన్నారు. మహిళలను ఇబ్బంది పెట్టొద్దని వచ్చే కొద్ది మంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
భవిష్యత్ గజ్వేల్దే..
ఏమి కోల్పోయామో ప్రజలకు అర్థమైందని ఎవరూ దిగులు పడద్దని భవిష్యత్ గజ్వేల్దే అన్నారు. స్థానిక ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లో మనమే గెలుస్తామని బీజేపీకి ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదన్నారు. గజ్వేల్లో కేసీఆర్ హయాంలో ఇల్లు, దుకాణాలు కిరాయికి దొరికేవి కావని ఇప్పుడు ఎటు చూసినా ఇండ్లు దుకాణాలకు టూ లెట్ బోర్డులు కనిపిస్తున్నాయని అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ సర్కార్ అబద్దాలతో కాలం గడుపుతుందన్నారు. అన్ని వర్గాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వరంగల్ సభకు సంబంధించిన కరపత్రాలను హరీష్ రావు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి, రవీందర్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు దేవి రవీందర్, శేఖర్ గౌడ్, జైపాల్ రెడ్డి, యాదగిరి మండలాల పార్టీ అధ్యక్షులు బెండ మధు కరుణాకర్ రెడ్డి, నవాజ్ మీరా, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్