సిటీబ్యూరో: ఒకే విభాగంలో ఐదేండ్ల కంటే ఎక్కువగా తిష్ట వేసిన సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ.. మల్కాజిగిరి కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ ప్రక్షాళన మొదలు పెట్టారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని విభాగాలపై పూర్తి అవగాహన ఉండాలని కమిషనర్ భావిస్తూ సిబ్బందికి సంబంధించిన రికార్డును పరిశీలిస్తున్నారు. ఇటీవల కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికి సంబంధించిన బదిలీలు నిర్వహించారు. తరువాత పై అధికారులపై ఫోకస్ పెట్టనున్నారు.
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన తరువాత హైదరాబాద్‌లో నార్త్‌జోన్‌లో చాలా పోలీస్స్టేషన్లు మల్కాజిగిరి కమిషనరేట్లోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌లోని అన్ని పోలీస్స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది డేటాతో వారు ఎక్కడక్కడ పనిచేశారు? ఏ విభాగంలో ఎన్ని రోజులు పనిచేశారనే సమాచారాన్ని తీసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ తదితర విభాగాల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. ఒకే విభాగంలో ఐదేండ్ల కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని ఆ విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ చేస్తున్నారు. సిబ్బందికి అన్ని విభాగాలపై పట్టుండాలని సీపీ భావిస్తున్నారు. కిందిస్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించారు.