కొమురవెల్లి, మార్చి 4: “పిల్లలకు పెట్టాల్సిన భోజనమేనా ఇది..నిర్లక్ష్యంగా వంటలు వండితే ఎలా, మెనూ ఎందుకు పాటించడం లేదు, మీ ఇస్టానుసారంగా పిల్లలకు భోజనం పెడితే సహించేదిలేదు”అని సిద్దిపేట కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి కస్తూర్బాపాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన బగారా అన్నం, ఆలుగడ్డ, టమాటా, గుడ్డు, సాంబారు, పెరుగును ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బగారా అన్నం రుచికరంగా లేదని, ఆలుగడ్డ కూర మరీపలుచగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం వంటలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వండిన ఆహారం నాణ్యతగా ఎందుకు ఉండటం లేదని వంట సిబ్బందిపై మండిపడ్డారు. కూరగాయలు లేవనే సాకుతో ఇస్టానుసారంగా వంటచేసి పిల్లలకు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. మెనూ పాటించకుండా, విద్యార్థులకు నాసిరమైన భోజనం అందిస్తున్న స్పెషలాఫీసర్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఈవోను ఫోన్లో ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ నెల 14న పదోతరగతి పరీక్షలు మొదలవుతాయని, ఏమైనా కఠినమైన సబ్జెక్టులు ఉన్నాయా, ఎలా ప్రిపేరవుతున్నారని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గణిత సబ్జెక్టుపై రోజుకు గంట అదనంగా తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో భోజనం, ఆరోగ్యం, వసతి, చదువు విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.