Rollavagu project | బీర్ పూర్ : మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు గత ప్రభుత్వంలో 90శాతం పనులు పూర్తి కావడంతో గేట్లు బిగించడానికి అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2015-16సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు 0.25 టీఎంసీ సామర్థ్యాన్ని1టీఎంసీ గా ఆధునీకరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం రూ.62కోట్లు మంజూరు చేయడంతో పనులు చేపట్టారు.
పెరిగిన అంచనాలతో ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకు రూ.136కోట్లు ఖర్చు చేసి దాదాపు పనులు సుమారు 90శాతం వరకు పూర్తి చేశారు. ఇటీవల అటవీశాఖ అధికారుల అనుమతుల కోసం అధికారులు నివేదిక పంపించారు. ముంపు గురైతున్న అటవీ భూములను బదులు వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో ప్రభుత్వ భూములను కేటాయించారు. అయినా ఇంకా అటవీ అనుమతులు మంజూరు కాక ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి ఎస్సారెస్పీ 53, 12 ఎల్ కాలువల ద్వారా నీరు వస్తున్న గేట్లు బిగించక వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లి పోతుంది.
ప్రస్తుతం ప్రాజెక్ట్ పరి పాలన అనుమతుల కోసం రూ.16.19కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం వ్యయం రూ.153కోట్లు కాగా ఇప్పటికే రూ.136 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన పనులకు ప్రస్తుతం రూ.16.19కోటు విడుదల చేసింది. వీటితో ప్రాజెక్ట్ కు మూడు గేట్లు ఏర్పాటుకు రూ.1కోటి, అడవుల అభివృద్ధికి రూ.8కోట్లు, రూ. కంకర పర్మిట్ల కోసం రూ.కోట్లు, మిగిలిన వాటిని జీఎస్టీ చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంవత్సర కాలం గా అటవీ అనుమతులు రాక పనులు ఆగిపోయాయి.
ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు పూర్తైతే బీర్ పూర్, ధర్మపురి మండలాల పరిధిలోని సుమారు 15వేల ఎకరాల కు పైగా సాగు నీరు అందుతుంది. ఈ రెండు మండలాలకు సాగు, తాగు నీటి ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం మంజూరైన నిధులతో పనులు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులు వస్తేనే కాంట్రాక్టర్ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.