Garima Agarwal | రాయపోల్, ఏప్రిల్ 16 : ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా పోషకాహారం తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషకాహారంపై నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో పోషణ పక్షం సందర్భంగా మండల స్థాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పౌష్టికా ఆహారానికి సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించారు.
చిన్న పిల్లలకు పలు రకాల పౌష్టికార స్వీట్లను స్వయంగా ఆమెనే తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు పోషకాహారం తీసుకోవడం ప్రతీ ఒక్కరికి అవసరమన్నారు. చిరుధాన్యాలతో సమతుల ఆహారం లభిస్తుందని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుందని తెలిపారు. అలాగే పాప పుట్టిన వెంటనే ముర్రు పాలు తాగించాలని పేర్కొన్నారు. కనీసం రెండేళ్ల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని చెప్పారు. బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.
చిరుధాన్యాలు తల్లి బిడ్డకు ఎంతో అవసరం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం పెంపొందించడానికి ఆకుకూరలు, పల్లీలు, నువ్వులు బెల్లం వస్తువులు, వివిధ రకాల చిరుధాన్యాలు తీసుకుంటే తల్లి బిడ్డకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పాలకూర, మునిగాకు, పొప్పెడ, రాగి, బెల్లం లడ్డూలు తదితర వాటిని గర్భిణీలు తీసుకుంటే రక్తహీన పరిస్థితి ఉండదని తెలిపారు.
అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను వినియోగించుకొని చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలని తల్లులకు సూచించారు. రాయపోల్ మండలవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు చాలా మంచిగా నడుస్తున్నాయని. ప్రతీ సెంటర్లో ఎండాకాలం అయినందున ఫ్యాన్లు ఫిటింగ్ చేయాలని ఎంపీడీవో బాలయ్యకు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఐసీడీఎస్ సీడీపీఓ సరిత, మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్, ఎంపీడీవో బాలయ్య, ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధ, షబానా, ఎంపీఓ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యాధికారి బల్ల మహారాజు, ఎస్సై వికుర్తి రఘుపతి, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్లు కిరణ్, రామ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు గర్భవతులు చిన్నారులు పాల్గొన్నారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు ఐసిడిఎస్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్