ఆత్మకూర్, ఏప్రిల్ 16 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద పంటలు సాగు చేస్తున్న ఆరేపల్లి, కత్తెపల్లి, గుంటిపల్లి, జూరాల, మోట్లంపల్లి తదితర గ్రామాల రైతులకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూరు తాసిల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు సాగునీరు విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు వందల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఏప్రిల్ చివరి మాసం వరకు రైతుల పంటలకు సాగునీరు విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు పంటలు చేతికి వచ్చే దశలో సాగునీరులు బంద్ చేయడంతో చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే ఎడమ కాలువ ద్వారా ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్ కార్యాలయ ఉద్యోగులకు వినతిపత్రం అందజేశారు. తాసిల్దార్ షేక్ షాన్ బాషా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ ఉండడంతో ఫోన్ ద్వారా మాట్లాడి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరేశలింగం, పలువురు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.