వేసవి వచ్చేసింది. మండే ఎండల్ని మోసుకొచ్చింది. అయితే, వేసవి అంటేనే కొందరు భయపడిపోతుంటారు. ఎండల్ని చూసి గజగజ వణికిపోతుంటారు. దీనినే వైద్య పరిభాషలో ‘హీలియోఫోబియా’గా పిలుస్తారు. ఈ ఫోబియా ఉన్నవారు ఎండలోకి వెళ్లడానికి జంకుతారు. వీలైనంత వరకు చీకటి గదుల్లో, తలుపులు, కిటికీలు మూసి ఉన్నచోట ఉండటానికే ఇష్టపడతారు. సాధారణంగా ఎండలో తిరగడానికి ఇబ్బంది పడటం మామూలు విషయమే! కానీ అది ఫోబియాగా మారి.. రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఆలోచించాల్సిందే!
గతంలో ఎండలో తిరగడం వల్ల తీవ్రమైన వడదెబ్బకు గురికావడం, ఇబ్బంది పడటం లాంటి సంఘటనలు ఎదురైనవారిలో ఈ ‘హీలియోఫోబియా’ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివారు ఎండలోకి వెళ్తే తలనొప్పి, మైగ్రేన్, కళ్లు తిరుగుతాయని భయపడుతుంటారు. సూర్యరశ్మి వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు. ఎండ వల్ల ముఖం మీద ముడతలు వస్తాయని, వయసు పైబడినట్లు కనిపిస్తామని అతిగా ఆందోళన చెందుతుంటారు. అందుకే, మధ్యాహ్నం బయటికి వెళ్లాలంటేనే జంకుతారు. వారి గుండెవేగం పెరుగుతుంది. చెమటలు పట్టడం, వణుకు రావడం కూడా గమనించవచ్చు. అయితే, ఇలా ఎండలోకి రాకుండా ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, సూర్యరశ్మి తగలకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి తగ్గి ఎముకలు బలహీనపడతాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం వల్ల ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇక, ఈ సమస్యకు కౌన్సెలింగ్‌తో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. తక్కువ సమయంపాటు తక్కువ ఎండలో ఉండటం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. సన్‌స్క్రీన్ లోషన్లు, గొడుగులు, సన్ గ్లాసెస్ వాడటం ద్వారా భయాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. మనసులో ఇంకా ఏదైనా భయం ఉంటే.. సైకాలజిస్టును సంప్రదించడం మంచిది.