BC Reservations | రాయపోల్, అక్టోబర్ 19 : బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు.
రిజర్వేషన్ అమలు విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపకుండా బీసీలను మోసం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలాడుతున్నాయన్నారు.
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో బిల్లు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోయి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలన్నారు.