హనుమకొండ, మార్చి 16 : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓ బాధితుడు కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. సోమవారం గ్రీవెన్స్‌లో భాగంగా కలెక్టర్ చాహత్‌బాజ్ పాయ్ బా ధితుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమం లో ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన పయ్యావుల మల్లయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్, పురుగు మందు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
వీరిలో పయ్యావుల సాంబరాజు పురుగు మందు డబ్బా పట్టుకొని కలెక్టరేట్ భవనం ఎక్కి.., తమ భూమిని ధర్మసాగర్ తహసీల్దార్ ఇతరుల పేర అక్రమంగా పట్టా చేశాడని, తమ భూమిని తమ పేర పట్టా చేయాలని, లేకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని హెచ్చరించాడు. దీంతో ఓ పోలీస్ అధికారి భవనంపై ఉన్న సాంబరాజు వద్దకు చేరుకొని సముదాయించి కిందికి దింపాడు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వివరాలు సేకరించిన కలెక్టర్ వెంటనే ధర్మసాగర్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం మీద భవనంపైకి ఎక్కిన సాం బరాజు కిందికి దిగడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బాధితుడు సాంబరాజు మా ట్లాడుతూ.. ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలో పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇందులో నుంచి ధర్మసాగర్ తహసీల్దార్ 10 గుంటల భూమిని ధర్మసాగర్‌కు చెందిన అప్పాల మహేందర్, అతడి కుటుంబ సభ్యుల పేర అక్రమం గా పట్టా చేశాడని ఆరోపించారు. వారు కాస్తులో ఉన్న తమ భూమిపైకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తాను (పయ్యావుల మల్లయ్య కుమారుడు సాంబరాజు) ధర్మసాగర్ తహసీల్దార్ కార్యాలయంలో, గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, దీంతో చావే శరణ్యమని భావించి కుటుంబంతో కలెక్టరేట్‌కు వచ్చినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ.. మోఖ మీద ఉన్న ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని, రికార్డు పరంగా ఇద్దరికీ పట్టా చేయడం జరిగింది తప్ప తాను ఎక్కడా తప్పు చేయలేదన్నారు. అక్రమంగా పట్టా చేశారని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే సివిల్ కోర్టు చూసుకోవాలని సూచించారు.