‘తెలంగాణను క్రీడారాష్ట్రంగా తయారు చేసిన. అందుకే ప్రముఖ ఫుట్బాల్క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్ రప్పించిన. చిన్నారులు, విద్యార్థులు, క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని కలిగించేందుకు రూ. వంద కోట్లు ఖర్చుచేసి మెస్సీని రప్పించి ఫుట్‌బాల్ ఆడిన. క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు నేను చేసిన ప్రయత్నాన్ని చూడకుండా రూ. వంద కోట్ల వ్యయం అని విమర్శిస్తున్న వాళ్లకు బుద్ధి లేదు. రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన క్రీడా విధానం తెచ్చింది. హైదరాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహించడమే నా ధ్యేయం.
జూలై 9న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ లోగో ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ గ్రౌండ్లో వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది !!
జగిత్యాల, జూలై 21 (నమస్తే తెలంగాణ) : 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అంతర్జాతీయ క్రీడల పతకాల రేసులో బాగా వెనుకబడిపోతున్నదని ఇటీవల సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన క్రీడావిధానం తెచ్చినదని పేర్కొన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదన్న విషయం రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే అర్థమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 434 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా పీఈటీలు 14 మంది మాత్రమే ఉన్నారంటే సర్కార్ క్రీడలను ఎంతలా ప్రోత్సహిస్తున్నదో తేటతెల్లం అవుతున్నది. దాదాపు 80 కాలేజీల్లో పీఈటీ పోస్టులు మంజూరే లేదు. పోస్టుల మంజూరు ఉన్న 354 కాలేజీల్లోనూ కేవలం 14 మందే పనిచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఉండగా 700 మందికి పైగా జూనియర్ లెక్చరర్లు బోధన చేస్తున్నారు. మండలానికి ఒక జూనియర్ కాలేజీ అన్న విధానాన్ని ప్రభుత్వాలు అనుసరించాయి. 1995 తర్వాత మంజూరు చేసిన జూనియర్ కాలేజీల్లో పీడీ/పీఈటీ, లైబ్రెరీయన్ పోస్టులను ప్రభుత్వాలు మంజూరు చేయకుండా నిలిపివేశాయి. దీంతో కొత్త కాలేజీల్లో పీడీ పోస్టులు లేకుండా పోయాయి. గతంలో రిక్రూట్ అయిన పీడీలు ఉద్యోగ విరమణ పొందారు. కొత్త కాలేజీల్లో పీడీ పోస్టుల మంజూరు లేకపోవడం, మంజూరు ఉన్న కాలేజీల్లో నియామకం చేపట్టకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. ప్రస్తుతం 64 జూనియర్ కాలేజీల్లో ఒక్కరంటే ఒక్క పీడీ కూడా లేకపోవడం గమనార్హం. ఒలింపిక్స్ నిర్వహించడమే ధ్యేయం.. స్పష్టమైన క్రీడా విధానం తెచ్చామంటూ గప్పాలు కొడుతున్న నేతలు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
మోడల్ కాలేజీల్లో పార్ట్‌టైం పద్ధతిలో..
జూనియర్ కాలేజీలు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో నిర్వహిస్తుండగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలు, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్ పరిధిలో ఏర్పాటు చేసిన మాడల్ పాఠశాలలు, కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ఆధీనంలోని చాలా పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులను గురుకుల సొసైటీలు పార్ట్‌టైమ్ పద్ధతిలో భర్తీ చేసుకొని విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాయి. పార్ట్‌టైమ్ విధానంలో క్రీడా ఉపాధ్యాయులకు సమయానికి వేతనాలు మంజూరు కాకపోవడం, పోస్టుల భర్తీ ఏటేటా జరుగుతుండడంతో ఆటలు సరిగా కొనసాగడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ అధీనంలో పాఠశాల, జూనియర్ కాలేజీ స్థాయి క్రీడలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏటా నిర్వహిస్తుంటారు. ఎస్జీఎఫ్లో అండర్ 14, 17, 19 కేటగిరీలుగా గేమ్స్ నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులంతా అండర్-19 విభాగం పరిధిలోకి వస్తారు. కొన్నేండ్లుగా అండర్ 19 విభాగంలో పాల్గొనేందుకు జూనియర్ కాలేజీల నుంచి విద్యార్థులు రావడం లేదు. దీంతో ఎస్జీఎఫ్లో అండర్ 19 విభాగంలో ఆటలు నిలిచిపోయాయి.
క్రీడలకు మంగళంపై విద్యావేత్తల్లో అసంతృప్తి
విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ తీర్చిదిద్దాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. క్రీడలను పూర్తిగా పక్కన పెట్టేసింది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఏవిధంగా అయితే విద్యార్థులపై ఒత్తిడితో కూడిన చదువులను నిర్దేశిస్తున్నాయో అలాంటి విధానాలను ఇంటర్‌బోర్డు సైతం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ పద్ధతిలో టైమ్‌టేబుల్ రూపొందించి, పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి తరగతుల బోధన ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు లంచ్ టైమ్ ఇస్తున్నారు. 1.30 నుంచి 3.00 గంటల వరకు సబ్జెక్టు బోధనకు అవకాశం కల్పించారు. 3 నుంచి 5గంటల వరకు ఆన్లైన్ క్లాస్‌లు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ విద్యార్థులకు, సీఏ, క్లాట్ కోచింగ్‌లకు ఆన్లైన్ క్లాస్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైమ్‌టేబుల్ ఫిక్స్ చేసిన ఇంటర్‌బోర్డు గేమ్స్‌కు అసలు అవకాశమే లేకుండా చేసింది.
గతంలో కాలేజీ చివరి రెండు గంటలు గేమ్స్‌కే వినియోగిస్తూ వచ్చారు. ఇప్పుడా పరిస్థితులు లేకుండా పోయాయి. జూనియర్ కాలేజీల్లో పీడీల నియామకం లేకపోవడం, ఆటలకు దాదాపు మంగళం పాడేయడం, కార్పొరేట్ కాలేజీల్లా టైమ్‌టేబుల్ ఫిక్స్ చేయడంపై విద్యావేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెస్సీని రప్పించడానికి రూ. వంద కోట్లు వ్యయం చేశామని గొప్పలు చెప్తున్న సీఎం ఆ డబ్బును కాలేజీల్లో క్రీడా సౌకర్యాలకు వెచ్చిస్తే నాలుగుకోట్ల జనాభా ఉన్న తెలంగాణ సైతం అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించగలదని అంటున్నారు. క్రీడాకారులు విజయం సాధించినపుడు వారిని సన్మానించి గొప్పలు చెప్పడం కాదు.. విజయం సాధించడానికి అవసరమైన వసతులు కల్పించాలని సూచిస్తున్నారు.