ఎల్ నినో.. ఇప్పుడు ఈ ఒక్క పదమే ఎక్కడ చూసినా వినిపిస్తున్నది. కాదు కాదు.. బెంబేలెత్తిస్తున్నది.అవును.. ఈసారి వర్షాలు పడకపోవడానికి, ఉష్ణోగ్రతలు పెరుగడానికి కారణం ఎల్ నినో ప్రభావమే మరి. వాతావరణంలో ఏర్పడిన ఈ మార్పుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిందిప్పుడు.వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వాహన అమ్మకాలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభిస్తుండగా, రుణ లభ్యత కరువవుతున్నది. స్టాక్ మార్కెట్లూ కుదేలవుతుండగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ సన్నగిల్లుతుండటం ఆందోళనకరం.
న్యూఢిల్లీ, జూలై 21: భారత్‌పై ఎల్ నినో ప్రభావం గట్టిగానే పడుతున్నది. వాతావరణంలో నెలకొన్న మార్పులు.. దేశాన్ని కరువు దిశగా నడిపిస్తున్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు దిగాలు పడగా.. మార్కెట్లో చోటుచేసుకున్న మందగమనం వ్యాపార-పారిశ్రామిక రంగాలను కుదేలు చేస్తున్నది. జేఎం ఫైనాన్షియల్ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనంలో పేర్కొన్న అంశాలు ఇవే మరి. గడిచిన 25 ఏండ్లలో దేశీయ వ్యవసాయం, ద్రవ్యోల్బణంపై ఎల్ నినో ప్రభావం ఎలా ఉందన్నది ఈ సందర్భంగా వివరించింది. కాగా, 2015-16 తర్వాత ఈ 2026-27లోనే ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా తేలడం గమనార్హం. మొత్తం 13 ఆర్థిక, వ్యవసాయ సూచీల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, ద్విచక్ర వాహన అమ్మకాలు, ట్రాక్టర్ల విక్రయాలు, ఖరీఫ్ పంటల సాగు, ఆహారోత్పత్తి, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, దేశ జీడీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా, విద్యుత్తు డిమాండ్, రుణ లభ్యత వంటి ప్రధానాంశాల ప్రాతిపదికన ఈ సర్వేను జేఎం నిర్వహించింది.
ఇదీ సంగతి..
దేశీయ వ్యవసాయ రంగం అత్యధికంగా వర్షాధారమే. అయితే వర్షాలకు అనువైన నైరుతి రుతుపవనాలను ఎల్ నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు అడ్డుకుంటున్నాయి. దీంతో వర్షపాతం తగ్గిపోతున్నది. 2000-01 నుంచి 2026-27 వరకు చూసినైట్టెతే 2015-16లో ఎల్ నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లోనే ఆ ప్రభావం అధికంగా కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగడంతో వర్షానుకూల వాతావరణం దెబ్బతింటున్నది. ఈ పరిస్థితి భారత్ సహా అనేక దేశాల్లో అనావృష్టికి దారితీస్తున్నది. కాగా, లా నినా కూడా ఉంటుంది. దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఫలితంగా అతివృష్టి సంభవిస్తుంది. 2007-08, 2010-11 ఆర్థిక సంవత్సరాల్లో ఇది బలంగా ఉన్నట్టు స్టడీలో తేలింది.
సంక్షోభం అంచున..
ఈ ఏడాది వర్షాకాలం మొదలై నెల రోజులు దాటిపోయింది. అయినప్పటికీ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సహా ఇతర దక్షిణాది రాష్ర్టాల్లో వర్షాల ఊసే లేకుండాపోయింది. ఇప్పటికే నదీ ప్రవాహాలు లేక జలాశయాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. వచ్చే నెల రోజుల్లో వర్షాలు పడకపోతే ఆహారోత్పత్తి గణనీయంగా క్షీణిస్తుందని, ఇది ద్రవ్యోల్బణం విజృంభణకు కారణం కాగలదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కూరగాయలు, పండ్లు, పప్పు దినుసుల ధరలు పెరిగిపోయాయి. పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ పెరుగుతూపోతున్నాయి. ఫలితంగా తగ్గే ఉత్పాదకత, పెరిగే రవాణా ఖర్చులు.. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలను పరుగులు పెట్టించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే రాబోయే ద్రవ్య సమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచేస్తుంది. దీంతో బ్యాంక్ రుణాలు ఖరీదెక్కుతాయని, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు పెట్టుబడుల కొరత వేధిస్తుందన్న ఆందోళనలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. చివరకు నిరుద్యోగం పెచ్చుమీరుతుందని, దేశ జీడీపీ ప్రగతి కుంటుబడుతుందంటున్నారు.
అమ్మకాలపై ప్రభావం
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత ఆదాయం లేకపోతే మొదటగా ట్రాక్టర్లు, టూవీలర్ల అమ్మకాలు ప్రభావితమవుతాయి. గడిచిన 25 ఏండ్లలో లా నినా ప్రభావ సమయంలో ట్రాక్టర్లు, టూవీలర్ల అమ్మకాల్లో వృద్ధి 10.7 శాతంగా ఉంటే.. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పుడు 3.5 శాతానికి పరిమితమవుతున్నదని జేఎం ఫైనాన్షియల్ తాజా అధ్యయనం చెప్తున్నది. దీన్నిబట్టి ఈసారి వాహన విక్రయాలు అంతంతేనని చెప్పవచ్చు. కాగా, లా నినాతో పోల్చితే ఎల్ నినో దెబ్బకు వర్షపాతం, పంటల సాగు, ఆహారోత్పత్తి అన్నీ మైనస్ గణాంకాల్లోకి వెళ్తాయని, ద్రవ్యోల్బణం పెరుగవచ్చని ఈ స్టడీ చెప్తున్నది.