kaleshwaram project | తొగుట, సెప్టెంబర్ 8 : పాము పగ తోక సుట్టం అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ప్రాజెక్టు ఆధారంగా మూసీ సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ప్రకటనలో విమర్శించారు. నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి తనంతట తానుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒప్పేనని ఒప్పుకున్నట్లయిందన్నారు.
కాళేశ్వరం కూలిపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండా మూసీ సుందరీకరణ చేపడుతారా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మూసీ సుందరీకరణకు కేవలం రూ.16 వేల కోట్లు కేటాయిస్తే, రేవంత్ సర్కార్ లక్షా యాభైవేల కోట్లు కేటాయించడం దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. మూసీ ప్రక్షాళన కోసం గత ప్రభుత్వ హయాంలోనే 30 మురికి నీటి శుద్దీకరణ ప్లాంట్లను నిర్మించడం జరిగిందన్నారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కేసీఆర్ హయాంలోనే రూ.4777 కోట్లతో కేశవపురం రిజర్వాయర్‌కు, కొండపోచమ్మ సాగర్ నుండి ఘనపూర్‌కు 10 టీఎంసీల నీటి శుద్దీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా రేవంత్ సర్కార్ రద్దు చేయడం జరిగిందన్నారు. మల్లన్నసాగర్లో శంకుస్థాపన చేయాల్సిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, హైదరాబాద్ కు గోదావరి జలాల ప్రాజెక్టు కార్యక్రమంకు గండిపేటలో శంకుస్థాపన చేయడం సరికాదన్నారు.
ముంపు గ్రామాల ప్రజల త్యాగాల పునాధుల మీద మల్లన్న సాగర్, కొండపోచమ్మ తదితర ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, వారికి గతంలో నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చాడని, వాటిని అమలు చేసిన తర్వాతే ఇక్కడి నుండి నీటిని తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
Srinivas Goud | రైతులందరికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Kanagal : యూరియా కోసం కనగల్ రైతుల ఎదురు చూపులు