లక్నో: వివాహిత మహిళ, యువకుడు సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఒక బాలిక చూసింది. తన తండ్రికి ఈ విషయం చెబుతానని ఆమె బెదిరించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఆ బాలికను హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో పడేశారు. (Woman, Teen Lover Kills Girl) ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల వివాహిత మహిళకు, పొరుగున ఉండే 17 ఏళ్ల యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సెప్టెంబర్ 4న భర్త, అత్త బయటకు వెళ్లడంతో ఆ మహిళ యువకుడ్ని తన ఇంటికి పిలిచింది.
కాగా, వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఆ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలిక చూసింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ బాలికను వారు బెదిరించారు. అయితే తన తండ్రికి చెబుతానని ఆ చిన్నారి చెప్పింది. ఈ నేపథ్యంలో మహిళ, ఆ యువకుడు కలిసి ఆ బాలిక గొంతునొక్కి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పాడుబడిన బావిలో పడేశారు.
మరోవైపు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ చిన్నారి కోసం వెతకగా బావిలో పడేసిన గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆమె మెడకు గుడ్డ బిగించి ఉండటంలో షాకయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా గుడ్డతో గొంతుబిగించి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
కాగా, బాలిక హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు నిందితులైన మహిళ, యువకుడ్ని అరెస్ట్ చేశారు. హత్య సందర్భంగా బాలిక పెనుగులాడటంతో ఆ మహిళ చేతిపై కొరికిన గుర్తులున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Wife Kills Husband | మద్యానికి బానిసైన భర్త.. చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య