నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 08 : యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరుతూ అవస్థలు పడుతున్నారు. కనగల్ మండల కేంద్రంలో యూరియా దొరక్క రైతులు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవారుజామున 4 గంటల నుంచే పాస్ బుక్స్, ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్నారు.
మండల వ్యవసాయ అధికారి అమరేందర్ గౌడ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతుకు రెండు బస్తాలు చొప్పున యూరియా అందజేశారు. మిగతా సగం మంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగిపోయారు. అదును దాటినా యూరియా దొరకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో రెండు, మూడు రోజుల్లో యూరియా దొరక్కపోతే నష్టం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kangal : యూరియా కోసం కనగల్ రైతుల ఎదురు చూపులు