Kodanda Reddy | అక్కన్నపేట, జూన్ 7 : రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ దృష్టికి చాలా రైతు సమస్యలు వస్తున్నాయని.. కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సమస్యలపై అధ్యయనం చేస్తూ పరిష్కార మార్గాలను సీఎం రేవంత్‌రెడ్డి సహా కేబినెట్ ముందు పెడుతున్నామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
త్వరలోనే 4 ఎకరాలపై ఉన్న రైతులందరికి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమవుతాయన్నారు. కమిషన్ ఆదర్శ రైతు వ్యవస్థ, చెరువులు, కుంటల పునరుద్ధరణ, రైతులకు మట్టి నమూనా పరీక్ష పరికరాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల పంపిణీ, పండే పంటలకు అనుగుణంగా కొత్త మార్కెట్లు ఏర్పాటు, ఆధునీకరణ మార్కెట్ల వ్యవస్థ, కౌలు రైతుల విషయంలో నిర్ధిష్టమైన ప్రణాళికలు, విత్తన చట్టం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేలా సిఫారసులు చేసి ప్రభుత్వం ముందు పెట్టామని.. కేబినెట్ ఆమోదం తరువాత అవి అమలు కానున్నాయన్నారు.
రైతే పెద్ద శాస్త్రవేత్త..
ములుగు జిల్లాలో మల్టీనేషనల్ కంపెనీలు రైతులను మోసం చేశాయనీ, ఈ విషయంలో కమిషన్ విచారణ చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2004 నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతే పెద్ద శాస్త్రవేత్త, దశాబ్ధాల కాలంగా ఎవుసం చేస్తూ, ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగం, వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అభివృద్ధి అవుతున్నాడని కోదండరెడ్డి వివరించారు.
సంప్రదాయ పంటల్లో పసుపు ఒక పంటననీ, ఈ పసుపు ద్వారా కరోనా సమయంలో ఎందరో బతికి బయటపడ్డారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా దేశ ప్రధాని మోడీ వెల్లడించారని గుర్తు చేశారు. ఎవుసంలో పెట్టుబడి తగ్గి ఆదాయం పెరిగే పంటలవైపు మళ్లాలని రైతులకు సూచించారు. పంట చేన్ల వద్ద కోతుల బెడద నివారించేందుకు నాబార్డు సహకరంతో సోలార్ ఫెన్సింగ్ వేసుకునేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు.
అనంతరం వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీన్ రెడ్డి, భవానిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు