Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)కి ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం దాదాపు గంట ఆలస్యమైంది. షిండే ప్రయాణించాల్సిన ప్రైవేట్ విమానం పైలట్ తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి టేకాఫ్‌కు నిరాకరించడంతో (Pilot Refuses To Fly) ఈ పరిస్థితి తలెత్తింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జలగావ్ (Jalgaon) జిల్లా ముక్తాయినగర్ (Muktainagar)లో శుక్రవారం నిర్వహించిన సంత్ ముక్తాయ్ పాల్ఖీ యాత్రలో పాల్గొనేందుకు షిండే ముంబై నుంచి అక్కడికి వెళ్లారు. వాస్తవానికి ఆయన మధ్యాహ్నం 3:45 గంటలకే జలగావ్ చేరుకోవాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముక్తాయినగర్ వెళ్లారు. ఇక కార్యక్రమం ముగించుకొని రాత్రి 9:15 గంటలకు షిండే జలగావ్ విమానాశ్రయానికి (Airport) చేరుకున్నారు. అయితే, అప్పటికే తన డ్యూటీ ముగియడంతో విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. తిరిగి అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. పైగా తనకు అనారోగ్యంగా ఉందని కూడా డిప్యూటీ సీఎంకు వివరించాడు.
ఆ సమయంలో షిండే వెంట మంత్రులు గిరీశ్ మహాజన్, గులాబ్ రావ్ పాటిల్ కూడా ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు పైలట్‌ను ఒప్పించేందుకు తీవ్రంగా చర్చలు జరిపారు. చివరికి గిరీశ్ మహాజన్ సంబంధిత అధికారులతో మాట్లాడి టేకాఫ్‌కు అనుమతులు కూడా ఇప్పించారు. దీంతో ఎట్టకేలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఓ మహిళకు షిండే మానవతా దృక్పథంతో సహాయం అందించారు. ముంబైలో అత్యవసరంగా కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన శీతల్ పాటిల్ అనే మహిళ, ఆమె భర్త విమానం అందుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి గిరీశ్ మహాజన్, షిండే విమానంలో వారిని ముంబైకి తరలించే ఏర్పాటు చేశారు. పేషెంట్ రాక సందర్భంగా ముంబై విమానాశ్రయంలో అంబులెన్స్ సర్వీసు కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు.
Also Read..
Shine Tom Chacko | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు షైన్ టామ్ చాకోను పరామర్శించిన కేంద్ర మంత్రి
Rs 500 Currency Notes | త్వరలో రూ.500 నోట్ల రద్దు..? ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?