న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty) భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. సింధూ నదికి చెందిన నీళ్లు ఇండియా అడ్డుకున్న నేపథ్యంలో.. పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం మొదలైనట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తూ సింధూర్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత కూడా ఇండస్ వాటర్ ట్రీటీపై పాకిస్థాన్ లేఖ రాసినట్లు చెబుతున్నారు.
ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే విధానంగా ఉండడం కుదరదని ఇండియా తేల్చింది. రక్తం, నీళ్లు కూడా ఒకే చోట ప్రవహించదన్నారు. సిందూ జలాల ఒప్పందాన్ని పరస్పర విశ్వాసం, స్నేహం ఆధారంగా రూపొందించారు. కానీ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్ చర్యలను భారత్ ఖండిస్తోంది. పాకిస్థాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి సయ్యిద్ అలీ ముర్తాజా ఆ లేఖలను .. కేంద్ర జలశక్తి మంత్రిత్వ కార్యాలయానికి పంపినట్లు స్పష్టం అవుతున్నది. ఆ లేఖను మళ్లీ విదేశాంగ కార్యాలయానికి పంపారు.
నీటి సంక్షోభాన్ని పరిష్కరించకుంటే ఆకలితో చస్తామని, సింధూ పరివాహక ప్రాంతం తమకు జీవాధారం అని, మూడో వంతు నీళ్లు తమకు దేశం బయటి నుంచి వస్తోందని, సిందూ బేసిన్‌పై 10లో 9 మంది ఆధారపడుతారని, 90 శాతం పంటలు ఆ జలాలపైనే ఆధారపడుతాయని, పవర్ ప్రాజెక్టులు, డ్యామ్‌లు అన్నీ సింధూ నదిపైనే కట్టారని, మాపై వాటర్ బాంబు పడినట్లు ఉందని, దాన్ని త్వరగా డిప్యూజ్ చేయాలని ఇటీవల పాకిస్థాన్ సేనేటర్ సయ్యిద్ అలీ జాఫర్ తెలిపారు. సింధూ, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ నదులకు చెందిన నీటిని వాడుకునేందుకు 1960లో ఇండస్ వాటర్ ట్రీటీని ఏర్పర్చుకున్నారు.