రుద్రంపూర్, మార్చి 08 : భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే గనిలో ఆదివారం మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు పైప్‌లైన్ నిర్వహిస్తున్న పూజారి శ్రీనివాస్, మూడు కృష్ణ ప్రమాదవశాత్తు పైప్‌లైన్ కాలు మీద పడడంతో ప్రమాదానికి గురై గాయపడ్డారు. వారిని సింగరేణి అంబులెన్స్‌లో మెయిన్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏరియా వర్క్‌షాప్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనదారుడు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. ఇదే సమయంలో గనిలో గాయపడ్డ కార్మికులను తీసుకెళ్తున్న సింగరేణి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. స్థానికులు అంబులెన్స్‌ను ఆపి పరిస్థితి వివరించగా, అప్పటికే గాయాలతో బాధపడుతున్న కార్మికులు కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
తామే గాయాలతో బాధపడుతున్నప్పటికీ, రోడ్డుపై ప్రాణాల కోసం పోరాడుతున్న వ్యక్తిని చూసి చలించిన కార్మికులు గొప్ప మనసు చాటుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వారిలో ఒకరు కష్టంగా అంబులెన్స్ నుండి దిగిపోయి డ్రైవర్ పక్కన కూర్చున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని సింగరేణి అంబులెన్స్ నుంచి తమ వాహనంలోకి మార్చి చికిత్స కోసం తీసుకెళ్లారు. తమ బాధను మరిచి, ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసిన అంబులెన్స్ డ్రైవర్‌ను, గాయపడిన కార్మికులను స్థానికులు అభినందించారు. “చీకటి సూర్యులు”గా పేరొందిన సింగరేణి కార్మికుల దయాగుణానికి ఇది మరో నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. పనిలో ధైర్యం.. జీవితంలో మానవత్వం – ఇదే సింగరేణి కార్మికుల అసలైన గొప్పతనం.

ప్రాణాపాయంలో ఉన్న వాహనదారుడికి సింగరేణి కార్మికుల సాయం