hut | రాయపోల్, ఫిబ్రవరి 9 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ కుటుంబానికి నిలువ నీడలేకుండా చేసింది. షార్ట్ సర్య్కూట్తో గుడిసె దగ్ధమైన ఘటన సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో చోటుచేసుకుంది.
బేగంపేట గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింలు-దుర్గావేణి దంపతులు ఇవాళ ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అయితే నర్సింలు ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో గుడిసెలో ఉన్న గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. తమకు సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఎరుకల నర్సింలు ఆవేదన వ్యక్తం చేశాడు. గుడిసెలో భద్రపరిచిన విలువైన డాక్యుమెంట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయని వాపోయాడు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, అధికారులను కోరుతున్నారు.
