Pak Ex Minister : నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తైబా చీఫ్ (Lashkar-e-Taiba Chief) పై పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Ex Minisster), అవామీ ముస్లిం లీగ్ నాయకుడు షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rasheed Ahmed) ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా భారత్ (India) పై విషంకక్కారు. లష్కర్ ఎ తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను సేవకుడినని ఆయన ప్రకటించారు. హఫీజ్ సయీద్ వెంట పాకిస్థాన్‌తోపాటు తాము ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. పాకిస్థాన్ వైపు కనీసం కన్నెత్తి చూస్తే భారత్‌ను అల్లా నాశనం చేస్తారని హెచ్చరించారు.
భారత దేశంలో పక్షుల కిలకిలారావాలు వినపడవని అన్నారు. దేవాలయాల్లో గుడి గంటలు కూడా మోగవని తీవ్ర స్వరంతో పాకిస్థాన్ మాజీ మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏం జరగదని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు తన ఫోన్లో హఫీజ్ సయీద్ ఫోన్ నెంబర్‌ను అధికారులు గుర్తించారని చెప్పారు. దాంతో ఆ దేశం నుంచి తనను బహిష్కరించారని ఈ సందర్భంగా పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ గుర్తు చేసుకున్నారు.
బహిరంగ సభలో షేక్ రషీద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. లష్కర్ ఎ తైబా సీనియర్ కమాండర్, పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఖాలీద్ మసూద్ సంధుతోపాటు ఆ సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్ సమక్షంలో పాకిస్థాన్ మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు షేక్ రషీద్ అహ్మద్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ క్యాబినెట్లో దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.