Supritha | టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సురేఖా వాణి ఇప్పుడు తెరపై తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆమె కుమార్తె సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ‘అమరావతికి ఆహ్వానం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 13న విడుదల కానుండగా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ తన తల్లి సురేఖా వాణికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని వెల్లడించింది. “రీసెంట్గా ఈ విషయం అమ్మతో చెప్పాను. కానీ ఆమె మాత్రం నాన్న జ్ఞాపకాలతోనే జీవించాలనుకుంటోంది. ఆ ప్లేస్‌లోకి వేరే ఎవరినీ రానివ్వకూడదని భావిస్తోంది. అదే సమాధానం నాకు చెప్పింది” అని సుప్రీత తెలిపింది. అయితే తాను పెళ్లి చేసుకునేలోపు అయినా అమ్మకు మంచి జీవిత భాగస్వామి దొరికితే బాగుంటుందని కోరుకుంటున్నానని చెప్పింది. “మా అమ్మను బాగా చూసుకునే వ్యక్తి రావాలి. ఆమె చాలా హ్యాపీగా ఉండాలి. ఆమె కోరుకున్నది ఇవ్వాలి. ఆమె స్పేస్‌ను గౌరవించాలి” అంటూ భావోద్వేగంగా స్పందించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించామని, వారు కూడా ఓకే అన్నారని తెలిపింది.
సురేఖా వాణి కెరీర్ గురించి కూడా సుప్రీత మాట్లాడింది. ఒకప్పుడు తన తల్లి ఎంతో బిజీ ఆర్టిస్ట్ అని, ఇప్పుడు మాత్రం అవకాశాలు తగ్గిపోయాయని పేర్కొంది. మేకప్ వేసుకుని ఏడాదిన్నర దాటిపోయింది. సినిమాల్లో నటించాలని అమ్మకు ఇంకా ఆసక్తి ఉంది. కానీ అవకాశాలు రావడం లేదు అని ఫీల్ అవుతోంది. కనీసం ఒక మంచి పాత్ర వచ్చినా చేయాలని ఉందని చెబుతోంది అని తెలిపింది. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక సుప్రీత హీరోయిన్గా పరిచయం అవుతున్న ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, శివకంఠనేని కీలక పాత్రల్లో నటించారు. జీవీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో మిస్టరీ, క్షుద్రపూజలు, మూఢనమ్మకాల అంశాలతో కథ నడుస్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో సుప్రీత ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.