Pongal Fight | తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద హీట్ పెంచబోతున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ సీనియర్ స్టార్ హీరోలు 60 ఏళ్ల వయసు దాటినా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తుండగా… ఇప్పుడు ఒకే సీజన్లో తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఆసక్తి రేపుతోంది. ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలు విడుదల కావడం సాధారణం. ఈ ఏడాది అయితే ఐదు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడంతో 2027 సంక్రాంతిపై పోటీ మరింత పెరిగింది.
ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సంక్రాంతి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించబోయే చిత్రాన్ని పండగ సీజన్‌కే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘మెగా 158’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేసేలా షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఫైట్‌కు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 111’ చిత్రాన్ని ఫెస్టివల్ టార్గెట్‌తోనే ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈ సీజన్‌ను వదిలే అవకాశం లేదనే అభిప్రాయం ఉంది.
ఇదే సమయంలో నాగార్జున మాత్రం అందరికంటే ముందే అడుగు వేసి సంక్రాంతి తేదీని అధికారికంగా ప్రకటించడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుంచి రాబోయే చిత్రం 2027 జనవరి 15న విడుదలవుతుందని ప్రకటిస్తూ “సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ అవుతుంది” అంటూ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటించే అవకాశముందనే టాక్ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే అది టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన సంఘటన అవుతుంది. గతంలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు క్లాష్ అయిన సందర్భాలు ఉన్నా… నలుగురు టాప్ సీనియర్లు ఒకేసారి పోటీ పడటం మాత్రం జరగలేదు. ఫ్యాన్ వార్స్, ట్రేడ్ అంచనాలు, థియేటర్ల సందడి అన్నీ కలిపి 2027 సంక్రాంతి అసలైన సినీ పండుగగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి నాగార్జున తేదీ ఖరారు కాగా, మిగతా ముగ్గురు హీరోల అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.