Madasu Srinivas | గజ్వేల్, ఏప్రిల్ 2: ఢిల్లీ కాంగ్రెస్ కార్పోరేటీకరణను వ్యతిరేకిస్తుంటే ఇక్కడ గల్లీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్లకు పంచుతుందని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విద్యార్థుల చమటతో అధికారంలోకి వచ్చిందో నేడు అదే విద్యార్థుల నెత్తురు కండ్ల చూస్తుందని అన్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ పోరాటం నిర్వహిస్తున్న హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్నదని మాదాసు శ్రీనివాస్ అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 1969 తెలంగాణ పోరాట ఫలితంగా ఏర్పాటైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కొని ప్రభుత్వం అమ్మాలనుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు.
నేడు కార్పొరేట్లకు అప్పగించడం మూర్ఖత్వం..
ప్రతీ పనికి ఇందిరమ్మను గుర్తుచేసే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు ఇందిరమ్మ చొరవతో ఏర్పాటైన హెచ్సీయూ భూములను లాక్కోవాలని చూస్తున్నారో చెప్పాలన్నారు. అత్యంత సహజసిద్ధంగా ఏర్పాటైన అడవిని అందులో తలదాచుకున్న వన్యప్రాణులని లెక్కచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పగలు, రాత్రి తేడా లేకుండా బుల్డోజర్లను దింపి వాటిని చెల్లాచెదురు చేయడం తెలంగాణ ప్రజలందరి హృదయాలను కలిచి వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో తన అనుచరుడు బిల్లీ రావుకు కట్టబెట్టిన ఈ 400 ఎకరాల భూమిని ఆ తర్వాత ఏర్పాటైన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడంతో బిల్లీ రావు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు అప్పటి నుండి ఆ భూమిని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ వచ్చాయన్నారు.
కేసీఆర్ హయాంలో ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుది తీర్పు రాగానే ప్రభుత్వం ఆ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణం అన్నారు. హైదరాబాద్ నగరంలో జీవవైవిధ్యానికి నెలవైన ఈ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వమే నేడు కార్పొరేట్లకు అప్పగించడం మూర్ఖత్వమన్నారు.
కాంగ్రెస్ పార్టీది ద్వంద వైఖరి..
గత కొన్ని రోజులుగా అటు విద్యార్థులు ఇటు పౌర సమాజం జీవవైవిధ్యం కాపాడాలని పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాత్రింబవళ్లు వందలాది జేసీబీలతో చెట్లను తీసివేస్తూ వన్యప్రాణుల్ని చెదరగొట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీది ద్వంద వైఖరి అని.. ఒక వైపు అధినాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందన్నారు.
గతంలో రోహిత్ వేముల మృతి సందర్భంగా హెచ్సీయూకు విచ్చేసి హక్కుల కోసం మాట్లాడిన రాహుల్ గాంధీ ఇవాళ అదే హెచ్సీయూ విద్యార్థులను గొడ్డులను బాదినట్టు బాదుతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం నడపడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అప్పు పుట్టడం లేదనే సాకుతో తెలంగాణ ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధపడిందన్నారు. గతంలో భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఎక్కడ దొరికితే అక్కడ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తుందన్నారు. అత్యంత ప్రజాస్వామ్య యుతంగా తమ నిరసనను తెలియజేస్తూ పశుపక్షాదుల పైన తమ కరుణను చూపిన హెచ్సీయూ విద్యార్థుల మీద కాటిన్యాన్ని ప్రదర్శిస్తూ లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ఏడో గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దానిని మర్చిపోయి ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వీటికి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.