చండీఘడ్: డిజిటల్ అరెస్టు వల్ల రిటైర్డ్ కల్నల్ దంపతులు భారీగా మోసపోయారు. ఆదా చేసుకున్న సుమారు రూ.3.4 కోట్ల డబ్బును కోల్పోయారు. పది రోజుల పాటు మోసగాళ్లు ఆ దంపతుల్ని డిజిటల్ అరెస్టు(Digital Arrest Fraud) చేసి ఆ మొత్తాన్ని కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 82 ఏళ్ల రిటైర్డ్ కల్నల్ దలీప్ సింగ్, ఆయన భార్య రవీందర్ కౌర్ బాజ్వాతో కలిసి చండీఘడ్‌లోని సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు. అయితే ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు ఆ వృద్ధ జంటను మోసం చేశారు. తొలుత వాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. ఆ తర్వాత కోర్టు నోటీసులు ఇచ్చి భయానికి గురి చేసినట్లు తెలిసింది. చండీఘడ్ సైబర్ సెల్లో ఆ వృద్ధ జంట ఫిర్యాదు చేసింది.
ఈడీ అధికారులమని తమ వద్ద సేవింగ్స్ రూపంలో ఉన్న సుమారు 3.4 కోట్ల డబ్బును సైబర్ మోసగాళ్లు కాజేసినట్లు దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. మార్చి 18వ తేదీన సింగ్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబైలోని కెనరా బ్యాంక్‌తో ఉన్న అకౌంట్‌తో మనీ ల్యాండరింగ్ లింకు ఉన్నట్లు ఆ కాల్‌తో సింగ్‌ను బెదిరించారు. జెట్ ఎయిర్వేస్ ఓనర్ నరేశ్ గోయల్‌కు మనీ ల్యాండరింగ్ చేసినట్లు సైబర్ నేరగాళ్లు ఆరోపించారు. ముంబైలో దలీప్ సింగ్ బజ్వా పేరుతో అకౌంట్ ఉన్నట్లు ఆయన భార్యకు నేరగాళ్లు ఫోన్ చేశారు. భర్త పేరుతో ఉన్న ఓ కార్డును కూడా చూపించారు. ఆ సమయంలో అన్ని కరెక్టుగా ఉన్నట్లు అనిపించిందని కౌర్ పోలీసులకు తెలిపింది.
సింగ్ పేరుతో ఉన్న కార్డును చూపించి. 5 వేల కోట్ల ఫ్రాడ్‌తో కనెక్షన్ ఉన్నట్లు బెదిరించారని కౌర్ పేర్కొన్నది. ఆ స్కామ్‌లో 24 మంది బాధితులు ఉన్నట్లు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారని చెప్పిందామె. మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు సైబర్ నేరగాళ్లు ఆ వృద్ధ దంపతుల్ని డిజిట్ అరెస్టు చేశారు. ఫోన్లు ఎప్పటికీ ఆన్‌లో పెట్టుకోవాలని ఆ జంటను నేరగాళ్లు హెచ్చరించారు. ఎవర్నీ కాంటాక్టు కావొద్దన్నారు. విషయం బయటకు తెలిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. సుప్రీంకోర్టు లెటర్ ప్యాడ్‌తో ఉన్న లేఖల్ని కొన్ని చూపించారు. అయితే తీవ్ర వత్తిడికి లోనైన ఆ జంట.. తమ అకౌంట్లలో దాచుకున్న 3.4 కోట్లను సైబర్ నేరగాళ్లకు చెందిన వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు.
తొలుత 8 లక్షలు కట్టాలని దలీప్ సింగ్‌ను బెదిరించారు. ఆ తర్వాత 60, 80, 88 లక్షలు డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లను క్యాష్‌గా మార్చేందుకు దలీప్ సింగ్ బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో.. సైబర్ నేరగాళ్లు అతని భార్యను త్వరగా డబ్బు ఆర్గనైజ్ చేయాలని బెదిరించారు.అయితే తన కుమారుడి స్నేహితుడిని కాంటాక్ట్ అయిన సమయంలో డిజిటల్ అరెస్టు గురించి తనకు తెలిసినట్లు సింగ్ చెప్పాడు. డిజిటల్ అరెస్టు గురించి తెలుసుకున్న దలీప్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దలీప్ సింగ్ తన ఇద్దరు కుమారుల్ని కోల్పోయారు. ప్రస్తుతం వారితో కోడలు, మనవరాళ్లు ఉంటున్నారు. యువకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేశానని, వృద్ధాప్యంలో సైబర్ నేరగాళ్ల మోసానికి దాచుకున్న డబ్బు కోల్పోయినట్లు బాధపడ్డారు. సైబర్ సెల్ తనకు సొమ్ము ఇప్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునే సామర్థ్యం పోలీసుల వద్ద ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.