Japan Solar Innovation | టెక్నాలజీ.. ఈ పేరు చెబితే చాలు.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జపాన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే వీరు సాంకేతిక రంగంలో 50 ఏళ్లు ముందుంటారనే చెప్పవచ్చు. అమెరికా అణుబాంబు దాడి తరువాత భారీ ఎత్తున నష్టపోయినప్పటికీ అంతే వేగంగా పుంజుకుని, చిన్న దేశమైనా బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిన తీరు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. జపాన్ దేశవాసులు అనేక రంగాల్లో సాధిస్తున్న ప్రగతికి ప్రపంచం నివ్వెరపోతూనే ఉంది. తాజాగా వారు విద్యుత్ రంగంలోనూ మరో అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా జనాభా భారీ ఎత్తున పెరుగుతున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పౌరులకు సదుపాయాలను కల్పించడంలో ప్రపంచ దేశాలు శ్రమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జనాభా అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రపంచ దేశాలకు కష్టంగా మారింది. జపాన్ కూడా ఈ రంగంలో పెను సవాళ్లనే ఎదుర్కొంటోంది. 2011లో వచ్చిన సునామి కారణంగా ఆ దేశం భారీ ఎత్తున నష్టపోయింది. ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ను ఉత్పత్తి చేయడం జపాన్‌కు సవాల్‌గా మారింది. అయితే ఇందుకు గాను ఆ దేశం ఎక్కువగా సోలార్ విద్యుత్‌పై ఆధార పడింది. కానీ సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టాలంటే భారీ ఎత్తున స్థలం అవసరం. అయితే ఇందుకు కూడా జపాన్ పరిష్కారాన్ని కనుగొంది.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో వాడే ప్యానెల్స్‌లో సిలికాన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. అయితే దీని కన్నా మరింత మెరుగైన సింథటిక్ మినరల్ ను జపాన్ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. perovskite (పెరోవ్‌స్కైట్) అని పిలవబడుతున్న ఈ పదార్థం స్ఫటిక నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది సిలికాన్ కన్నా చాలా తేలిగ్గా మరింత సౌకర్యవంతంగా వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. సిలికాన్ కన్నా పెరోవ్‌స్కైట్ 43 శాతం సమర్థవంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిలికాన్ కన్నా పెరోవ్‌స్కైట్ సెల్స్ 29 శాతం అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. ఇవి 20 న్యూక్లియర్ రియాక్టర్లతో సమానమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జపాన్ అంతటా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో పెరోవ్‌స్కైట్ సెల్స్‌ను వాడడం మొదలు పెట్టారు.
అందులో భాగంగానే 2040 వరకు పెరోవ్‌స్కైట్ సెల్స్ సహాయంతో ఏకంగా 20 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో 2050 వరకు కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తెచ్చే మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. సోలార్ విద్యుత్ రంగంలో జపాన్ చేసిన ఈ ఆవిష్కరణ మూలంగా తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ చేసిన ఈ ఆవిష్కరణ ప్రపంచ దేశాలకు మార్గం చూపిస్తుందని భావిస్తున్నారు.