సిటీబ్యూరో, బండ్లగూడ, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను కూల్చాలని చూస్తే సహించబోమని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేద ప్రజల ఇండ్లను కాదు కదా.. ఇంటి సున్నాన్నీ టచ్ చేయనీయమని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు హైదర్షా కోట్, గంధంగూడ పరిధిలోని కాలనీల్లో ఆదివారం మూడున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న కాలనీల ప్రజలతో కేటీఆర్ ముచ్చటించారు.
కేటీఆర్ పాదయాత్రలో బాధిత ప్రజలు అడుగడుగునా ఆర్తనాదాలు చేశారు. ఓటేసి గెలిపించిన పాపానికి తమ ఇండ్లనే కొల్లగొడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బాధితులు శాపనార్థాలు పెట్టారు. ఆవేదనతో తన వద్దకు వచ్చిన బాధితులను అక్కున చేర్చుకుని కేటీఆర్ ఓదార్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంటిని కూడా ముట్టుకోనీయమని భరోసా కల్పించారు. ఇండ్లను కూల్చేందుకు రేవంత్‌రెడ్డి బుల్డోజర్లను పంపిస్తే వాటి ముందు పడుకోనైనా ఆపుతామని, బాధిత ప్రజలకు కేసీఆర్ సైన్యం అనునిత్యం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గంధంగూడలోని విగ్నేశ్వర కాలనీ, ఫోర్ట్‌వ్యూ అపార్ట్మెంట్, డ్రీమ్ హోమ్స్ అపార్ట్మెంట్, సాయిరాం కాలనీ, రంగారెడ్డి కాలనీ, మారుతీనగర్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ నివాసితులతో కలిసి వారి వేదనను విన్నారు. ఇండ్లను కోల్పోకుండా కలిసి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. బాధితుల పక్షాన అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టి న్యాయం చేకూర్చేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, కేపీ వివేకానంద్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, బండ్లగూడ మాజీ మేయర్ లతప్రేమ్, బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
చిన్నారులు, వృద్ధుల వినతులు
పాదయాత్రలో భాగంగా బాధిత కాలనీల్లోని చిన్నారులు, వృద్ధులు కేటీఆర్ వద్దకు వచ్చి తమ ఇండ్లను కూల్చకుండా ఆపాలని వేడుకున్నారు. మా ఇండ్లను కూల్చడానికి వాళ్లెవరని, ఆపడానికి వచ్చినందుకు ధన్యవాదాలని కేటీఆర్‌కు చిన్నారులు థ్యాంక్స్ చెప్పారు. చిన్నారులతో ముచ్చటించిన కేటీఆర్ ‘మీ ఇంటిని ఎవ్వరూ ముట్టుకోకుండా కాపాడతాం..ఎలాంటి భయం, బెరుకు లేకుండా చదువుకోవాలి’ అని భరోసా కల్పించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏ ఇబ్బంది లేకుండా బతికామని సంబంధిత కాలనీల ప్రజలు కేటీఆర్‌తో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కంటిమీద కునుకులేకుండా బతకాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు తమ మీద కక్ష తీర్చుకుంటున్నారని వృద్ధులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్లకార్డుల ప్రదర్శన.. నినాదాలు
గంధంగూడ విగ్నేశ్వర కాలనీ నుంచి మధు పార్కు రిడ్జ్ దాకా కేటీఆర్‌తో పాటు ఆయా కాలనీల మూసీ బాధితులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. అభివృద్ధి అంటే ఇండ్లు కూల్చడమా? మా ఇండ్లు కూల్చే హక్కు మీకెవరిచ్చారు? మా ఇండ్ల జోలికి రావొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం డౌన్ డౌన్.. వీ వాంట్ జస్టీస్ నినాదాలతో హోరెత్తించారు. ‘రావాలి రావాలి మళీ కేసీఆర్ రావాలి’ అంటూ నినదించారు. ‘మూసీ దండి మార్చ్’ పేరిట బ్యానర్లు ప్రదర్శిస్తూ ‘ప్రజలను ఇబ్బంది పెట్టే విగ్రహాలు నాకొద్దు’ అనే కొటేషన్‌తో ఉన్న గాంధీ ఫోటో ఉన్న టీషర్ట్లను ధరించి పాదయాత్రలో కదం తొక్కారు. ఆదివారం సెలవు రోజయినా తమకు న్యాయం చేయాలని ఆయా కాలనీల ప్రజలంతా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలంతా రోడ్డెక్కడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ఇదే ఉత్సాహంతో ముందుకు వస్తే కలిసి పోరాడి కాంగ్రెస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేద్దామని వాళ్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Ktr
బఫర్‌జోన్ వర్తించదా?
మూసీ బఫర్ జోన్ పేరిట పట్టా భూముల్లో అనుమతులున్న ఇండ్లను కూలుస్తున్నారు. ప్రజల ఇండ్లను కూల్చి వాటి స్థానంలో హోటళ్లు, మాళ్లు, రెస్టారెంట్లు, బార్లు నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. పేదల ఇండ్లకు వర్తించిన బఫర్‌జోన్ ప్రభుత్వం కట్టే నిర్మాణాలకు వర్తించదా? మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం, తన అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ చేసి చూపించి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోడల్‌గా నిలిపారు. నాగోల్ ప్రాంతానికి వెళ్లి చూస్తే కాంగ్రెస్ నేతలకు సుందరీకరణ ఎలా ఉంటుందో కనువిప్పు కలుగుతుంది. పైసా పైసా కూడబెట్టుకుని, లోన్లు తెచ్చుకుని కట్టుకున్న ఇంటిని కూల్చే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఒక్క రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే 10 వేల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ మా ఎమ్మెల్యే మాత్రం ప్రజలను గాలికొదిలేసి పదవులు అనుభవిస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేను చేసిన పాపానికి ప్రజలకు నరకం చూపిస్తున్నారు.
-కార్త్త్తీక్రెడ్డి, బీఆర్ఎస్ నేత
మినీ ఇండియాను విచ్ఛిన్నం చేస్తారా?
మధు పార్క్ రిడ్జ్ అనేది కొన్ని ఇండ్ల సమూహమే కాదు. ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని ప్రాంతాల వాళ్లం ఉన్నాం. అందరం సొంత కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఎలాంటి విభేదాలు లేకుండా బతుకుతున్నాం. మినీ ఇండియాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్ఛిన్నం చేసేందుకు సిద్ధమైంది. ఈ అపార్ట్మెంట్లో సగానికి పైగా ఆర్మీ కుటుంబాలున్నాయి. ప్రభుత్వంపై యుద్ధం చేస్తాం కానీ మా అపార్ట్‌మెంట్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం. 2004లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలం బఫర్ జోన్లో లేదని అనుమతులిచ్చింది. ఇప్పుడు ఇదే ప్రభుత్వం బఫర్ జోన్ ఉందని అంటున్నది. మా ఇండ్లను వదులుకోం.
– బాధిత మహిళ, మధు పార్క్ రిడ్జ్
ప్రశాంతంగా తినలేకపోతున్నాం
మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. కూల్చేస్తారని భయపెడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గరి నుంచి నిద్ర పట్టడం లేదు. ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నాం. ప్రశాంతంగా తిండి తినలేకపోతున్నం, నిద్రపోలేకపోతున్నాం. మా పిల్లలు మా ఇండ్లను కూలుస్తారా? దీనంగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని దుస్థితిలో రోధిస్తున్నాం. ప్రజల ఇండ్లను కూల్చి విగ్రహాలు పెట్టడం ఏంటి? అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్మమైంది. పైసా పైసా కష్టపడి కొనుకున్న ఇళ్లను ఖాళీ చేయమంటే ఎలా? ప్రభుత్వంపై తీరుకు నిరసనగా ఆందోళన చేస్తాం..
– యమున, ఫోర్ట్‌వ్యూ అపార్ట్మెంట్స్
రేవంత్‌రెడ్డిది రాజధర్మం కాదు.. రౌడీ ధర్మం
తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇండ్లను కూలుస్తూ, భూములను కొల్లగొడుతూ అన్ని వర్గాల ప్రజలను రేవంత్‌రెడ్డి గోసపెడుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్‌రెడ్డి చేస్తున్నది రాజధర్మం కాదు.. రౌడీ ధర్మం. ప్రభుత్వమే రౌడీల్లా వ్యవహరిస్తే మేం ఎక్కడికి పోవాలి. ఎవరికి చెప్పుకోవాలి. రూపాయి రూపాయి కూడబెట్టుకుని, బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చే హక్కు అధికారులు, ప్రభుత్వానికి ఎవరిచ్చారు. ఓట్లేసి గెలిపించిన మా ఎమ్మెల్యే ఇక్కడ బిల్డర్లు అక్రమంగా ఇండ్లు కట్టారని చెబుతున్నారు. ఓట్లేసి గెలిపించినందుకు మాకు బుద్ధి చెబుతున్నారు.
– లక్ష్మీదేవమ్మ, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్


