KCR | తొగుట : తెలంగాణ ప్రధాత, తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతోనే కూడవెల్లి వాగుకు గోదావరి జలాలతో జలకళ వొచ్చిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి కి స్పందించి నీటిని విడుదల చేసిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, విడుదల చేయించిన ఎమ్మెల్యేకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ వొస్తేనే మన కరువు గోస తీరుతుందని చెప్పిన కేసిఆర్ కేవలం మూడేళ్లలో కాళేశ్వరం నుండి కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు పూర్తి చేసి గోదావరి జలాలను పారించడం జరిగిందన్నారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్లు ప్రాజెక్టులు నిర్మించి, నీళ్లతో ఉన్నప్పటికీ కేవలం గేట్లు విడవడానికే ప్రభుత్వానికి కష్టమవుతుందన్నారు. మల్లన్న సాగర్ నిర్మించిన తర్వాతే గోదావరి జాలలతో జీవనదిగా మారిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్త శుద్ధి లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్త శుద్ధి లేదని, రుణమాఫీ అసంపూర్తిగా అమలు చేశారని, రైతుబంధు సక్రమంగా వేయలేదన్నారు.. ప్రభుత్వాలు వొస్తుంటాయి.. పోతుంటాయి కానీ, ప్రజల కోసం చేసిన పనులే కలకాలం నిలిచిపోతాయన్నారు..
రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ప్రాజెక్టుల ఉప కాలువలు పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలన్నారు. మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగులోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. వాగు ప్రవహిస్తున్నందున వాగు పరివాహక రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.