Leopard | రాయపోల్, మార్చి 19 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లికి చెందిన గల్వన్ చెరువు వద్ద పులి సంచరిస్తూ రైతులకు కనిపించింది. ఓ వ్యక్తి పులి సంచరిస్తున్న వీడియో తీసి పలు గ్రూపులలో పోస్ట్ చేశాడు. దీంతో తిమ్మక్కపల్లి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి హైమద్ హుస్సేన్‌ను అడగగా.. తనకు సమాచారం వచ్చిందని.. అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే రెండు గ్రామాలకు చెందిన ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్‌తోపాటు అటవీ శాఖ సిబ్బంది తిమ్మక్కపల్లిలోని గల్వనిచెరువులో పులి అడుగులు అనవాళ్లను గుర్తించామని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి అచూకీ కోసం కనుగొంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాత్రి వేళ్లలో వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచరాదని సూచించారు. ప్రజలు కూడా బోర్లు వద్దకు వెళ్లకూడదని సూచించారు. సాధ్యమైనంత త్వరలో పులి జాడను తెలుసుకుంటామని సందీప్ కుమార్ పేర్కొన్నారు.