Fishermen | రాయపోల్, డిసెంబర్ 24 : ప్రభుత్వం మత్స్యశాఖ సహకార సంఘాలకు అన్ని విధాలుగా చేయూతనందిస్తోందని సిద్దిపేట జిల్లా రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి పేర్కొన్నారు.
బుధవారం రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు నీల స్వామి, ఉప సర్పంచ్ వేణు, సంఘం ప్రతినిధులు జోడు కరుణాకర్, మంగిడిపల్లి వెంకటి, రమేష్, కనకయ్యలతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనాజీపూర్ పెద్ద చెరువులో మొత్తం లక్షా 36 వేల చేప పిల్లలను, తిమ్మక్కపల్లి చెరువులో 57 వేల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. రాయపోల్ మండలంలోని అన్ని చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చేప పిల్లలను వదలడం జరుగుతుందని పేర్కొన్నారు.
చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా వారి ఆదాయం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్నకార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్, మత్స్యశాఖ సహాయకులు వంశీతోపాటు మత్స్యకారులు పాల్గొన్నారు.