లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురంలో సర్పంచులు ప్రోటోకాల్(Protocol) లొల్లికి దిగారు. కల్యాణలక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) హాజరయ్యారు. కాగా, అధికారిక కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్‌ను వేదికపైకి ఆహ్వానించాలని ప్రొటోకాల్ నిబంధన ఉంది. దానికి విరుద్ధంగా లింగాల గణపురం బీఆర్ఎస్ సర్పంచ్ ఎడ్ల లావణ్యను పిలవాల్సి ఉండగా..ఆమెపై కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఓడిన శ్రీలత రెడ్డిని, లింగాల గణపురానికి చెందిన నీలం మోహన్‌ను మార్కెట్ డైరెక్టర్ హోదాలో వేదికపైకి ఆహ్వానించారు.
సభ జరిగేంతవరకు టెంట్ కింద ప్రత్యేకంగా సర్పంచుల కోసం వేసిన కుర్చీలలోనే ఎడ్ల లావణ్య ఉండిపోయింది. లబ్ధిదారులకు చెక్కులను ఇచ్చే సమయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించాల్సి ఉండగా..కొన్ని గ్రామాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను వేదికపైకి పిలిచి వారిచే మా సర్పంచ్ అంటూ చెక్కులను ఇప్పించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే వెళ్లిపోగానే తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శివ శంకర్ రెడ్డితో పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ సర్పంచులు గొడవకు దిగారు. కార్యక్రమానికి మమ్ములను ఆహ్వానించి పరువు ఎందుకు తీశారని విరుచుకుపడ్డారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ సర్పంచులు ధర్నాకు దిగి.. కడియంకు మండల అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.