Farmers | రాయపోల్, నవంబర్ 25 : ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు, ఐకేపీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన నీటి సౌకర్యాలు. ధాన్యం జల్లి మిషన్లు, టెంట్లు లేకపోవడంతో కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యాన్ని ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. తెచ్చిన ధాన్యం రోజుల తరబడి కేంద్రాల వద్ద ఉండడంతో రైతులు అక్కడనే వారి పనులు వదులుకొని ధాన్యం తూకం వేసే వరకు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షాల నుండి కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం వరి, మొక్కజొన్న తదితర పంటలు తడిసిపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. బహిరంగ మార్కెట్లో టార్పాలిన్లు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేయలేక కొంత మంది రైతులు ఎరువుల బస్తాలను పరదాలుగా కుట్టించి వర్షాల నుండి ధాన్యం తడవకుండా కాపాడుకుంటున్నారు. మండలంలో ఇప్పటికే పలు గ్రామాలలో వరి కోతలు ప్రారంభమయ్యాయి.
మరికొన్ని గ్రామాలలో కోతలు ప్రారంభించారు. మండలంలో 15 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 1 సొసైటీ సెంటర్ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి. కోతలు పూర్తయినా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
టార్పాలిన్ కవర్లు నిలిపివేయడంతో..
2018 వరకు ప్రభుత్వం రైతులకు టార్పాలిన్లు 50 శాతం సబ్సిడీపై రూ.1250 అందించేది. మూడు సంవత్సరాల వరకు టార్పాలిన్ కవర్లు మన్నికతో ఉండడంతో రైతులు కూడా తీసుకోవడానికి పోటీపడేవారు. గత 8 ఏళ్ల నుండి ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా టార్పాలిన్లు అందించేది. వాటిని నిలిపివేయడంతో రైతులు ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేయలేక వర్షాల నుండి పంటలను కాపాడుకోలేక రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కాగా ప్రభుత్వం సబ్సిడీపై అందించే టార్పాలిన్ కవర్లు నిలిపివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. రూ.3,4 వేలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దుకాణాల్లో కొనుగోలు చేసిన టార్పాలిన్లు ఒక పంట కాలం మాత్రమే ఉంటున్నాయని, మరో పంటకు ఉపయోగపడటం లేదని రైతులు చెబుతున్నారు. అంత డబ్బులు వెచ్చించలేని రైతులు పరదాలు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక పరదా రోజుకు రూ.20,30 లు అద్దె చెల్లించాల్సి వస్తుందని, ఇది కూడా బారంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక రైతు ఒక ఎకరం ధాన్యం ఖరీఫ్‌లో ఆరబెట్టుకోవడానికి అద్దె పరదాలు 6,8 వరకు అవసరం. కాగా పూర్తిగా డ్రై అవ్వడానికి 7 నుండి 10 రోజులు పడుతుందని రైతులు తెలిపారు. ఇది కాక కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టేందుకు ఆలస్యం అవ్వడంతో అద్దెకు తెచ్చుకున్న పరదాలకు అధికంగా ఖర్చు దాదాపు రూ.3,4 వేల వరకు అవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సబ్సిడీపై టార్పాలిన్ కవర్లు అందించాలని కోరుతున్నారు.
గ్రామాల్లో జల్లీల కొరత..
ఐకేపీ కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేయాలని రైతులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో జల్లీల కొరత, బార్ధన్ కొరత ఉండడంతో రైతుల ధాన్యం రోజుల తరబడి కేంద్రాల్లోని నిల్వ ఉంటుంది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.


Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త