కొలంబో: పాకిస్తాన్ క్రికెటర్(Pakistan Cricketer) ఒకరు హోటల్ మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో సూపర్ 8 స్టేజ్‌లో శ్రీలంకతో మ్యాచ్ జరగడానికి ముందు కాండీ హోటల్లో ఈ ఘటన జరిగింది. హోటల్లోని హౌజ్ కీపింగ్‌కు చెందిన మహిళా సిబ్బందితో అనుచితంగా వ్యవహరించిన ఆ క్రికెటర్‌కు జరిమానా కూడా వేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వరల్డ్ కప్ జట్టులోని ఓ సభ్యుడు ఫిమేల్ హౌజ్‌కీపింగ్ సిబ్బందితో తప్పుగా ప్రవర్తించినట్లు ఓ మీడియా తన కథనంలో పేర్కొన్నది. ఆ మహిళ గట్టిగా అరవడంతో .. అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది ఆమెను రెస్క్యూ చేసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేశారు. అయితే గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్నారు. కఠిన శిక్ష విధించాలన్నారు. అయితే పాక్ టీం మేనేజర్ చీమా ఆ ఘటన పట్ల క్రికెటర్ తరపున క్షమాపణలు చెప్పారు. సూపర్ 8 స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్ నెగ్గినా.. సెమీస్‌లోకి ప్రవేశించలేకపోయింది. హౌజ్‌కీపింగ్ సిబ్బందితో అనుచితంగా వ్యవహరించిన ఆ క్రికెటర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకోనున్నది.