Farmers Strike | రాయపోల్, ఆగస్టు 19 : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో రైతులకు యూరియా పంపిణీ చేయడంలో వ్యవసాయ అధికారులు విపులమయ్యారని రైతులు ఆగ్రహించారు. యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం శివాజీ చౌరస్తా వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ అధికారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రైతులు మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యూరియా తగినంత రైతులకు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. మనిషికి రెండు బస్తాల యూరియాను అందించి చేతులు దులుపుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు రెండు బస్తాల యూరియా కోసం షాపుల వద్ద క్యూలైన్ కట్టి పనులు వదులుకొని యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు..
మండలానికి యూరియా ఎంత వస్తుంది రైతులకు ఎంత పంపిణీ చేస్తున్నారని పర్యవేక్షణ కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులకు ఒకసారి మండలానికి యూరియా వస్తే ప్రైవేటు దుకాణదారులు 300 నుండి 350 రూపాయల వరకు అమ్ముతున్నప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేసినా వ్యవసాయ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. వచ్చిన యూరియా అందరికి సమానంగా ఇవ్వాల్సింది పోయి ఫర్టిలైజర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తూ యూరియా అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు.
ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్లో అధిక ధరలకు యూరియాను అందిస్తున్నారని, దీనిని అరికట్టడంలో స్థానిక వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల రైతులు వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం చెందారు. రైతుకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా కోసం రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ అక్కడికి వెళ్లి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడకు చేరుకొని వ్యవసాయాధికారులతో మాట్లాడి రైతులకు సముదాయించి యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి