Farmers Protest | రాయపోల్, ఆగస్టు 26 : యూరియా పంపిణీ చేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు మండల కేంద్రానికి చేరుకొని చౌరస్తా వద్ద కేటాయించి ఆరు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఫర్టిలైజర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాఖ అధికారులతో టోకెన్లు రాయించుకొని.. ఇష్టం వచ్చిన వారికి యూరియా అందిస్తూ మిగతా రైతులను పట్టించుకోవడంలేదని, తమకు టోకెన్లు ఇచ్చారని.. యూరియా ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా ఇస్తామని టోకెన్లు ఇచ్చారని రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు యూరియా ఇవ్వడంలో అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఫర్టిలైజర్ వ్యాపారులు వైఫల్యం చెందారని పలు గ్రామాల రైతులు వాపోయారు.
చల్లారని రైతుల ఆగ్రహం..
యూరియా కోసం గంటలపాటు రైతులు ధర్నా రాస్తారోకో చేయడంతో మండల కేంద్రంలో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితులు గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. అయినప్పటికీ రైతులు యారియా ఇచ్చేవరకు కదిలే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పడంతో తొగుట సీఐ షేక్ లతీఫ్ దౌల్తాబాద్, రాయపోల్, బేగంపేట, తొగుట ఎస్ఐలు అరుణ్ కుమార్, మానస, మహిపాల్ రెడ్డి తదితరులు ధర్నా చేస్తున్న రైతులను సముదాయించారు. అయినప్పటికీ రైతుల ఆగ్రహం చల్లార లేదు. టోకెన్లు ఇచ్చిన రైతులందరికీ ఖచ్చితంగా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింలు దౌల్తాబాద్ మండల కేంద్రానికి చేరుకొని ధర్నా చేస్తున్న రైతులను సముదాయించారు. సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి టోకెన్లు ఇచ్చిన రైతులకు రెండు రోజుల్లో యూరియాను అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. కాగా అధిక ధరలకు యూరియాను విక్రయించిన జ్యోతి ఫర్టిలైజర్ షాప్తోపాటు రోహిణి ఫర్టిలైజర్ షాపును దుబ్బాక వ్యవసాయ శాఖ ఏడీఏ మల్లయ్య ఆధ్వర్యంలో సీజ్ చేశారు. రెండు రోజుల్లో యూరియా అందించకుంటే మళ్లీ రోడ్డుపై ధర్నా చేస్తామని పలు గ్రామాల రైతులు పేర్కొన్నారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం