Hyderabad | హైదరాబాద్ మెహిదీపట్నంలో పెను ప్రమాదం తప్పింది. మెహదీపట్నం బస్టాండ్లో ఓ సిటీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులు అందర్నీ కిందకు దించేశాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మెహిదీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ సిటీ బస్సు.. లింగంపల్లి నుంచి మంగళవారం ఉదయం మెహిదీపట్నం చేరుకుంది. బస్టాండ్ సమీపంలోకి రాగానే బస్సు ఆగిపోయింది. దీంతో బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. మళ్లీ బస్సును సెల్ఫ్ స్టార్ట్ చేసేందుకు యత్నించగా స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. ఆ తర్వాత డ్రైవర్ బానెట్ ఓపెన్ చేసి కేబుల్స్ సరిచేసే ప్రయత్నం చేయగా.. బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే బస్సు ముందుభాగం పూర్తిగా దగ్ధమైంది. కాగా, ఘటనాస్థలికి చేరుకు మెహిదీపట్నం డిపో మేనేజర్, మెకానిక్ విభాగం ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
హైదరాబాద్ – మెహదీపట్నంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/FpF0TfLZoO
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2025