సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త వెలుగుల ప్రాజెక్టు వెనుక చీకటి రాజకీయం మొదలైందా? కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించే ఈ భారీ కాంట్రాక్టును దకించుకునేందుకు ముఖ్య నేత అనుచరుడు రంగంలోకి దిగి పావులు కదుపుతున్నారా? అంటే బల్దియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. త్వరలో సుమారు 1,341.6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని సినీ రంగంతో అనుభవం ఉన్న సదరు ముఖ్య నేత అనుచరుడు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నట్లు చర్చ జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో అత్యాధునిక ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టును అమలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ. 1,341 కోట్ల భారీ అంచనాతో ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా..ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనుక లోతైన ‘రాజకీయ’ వ్యూహం ఉందన్న చర్చ నడుస్తున్నది. గతంలో కంటే నిర్వహణ ఖర్చును పెంచడంతో పాటు మెటీరియల్ కూడా సదరు ఏజెన్సీ చేతుల్లోకి పెట్టి పదేండ్ల పాటు వీధి లైట్ల ప్రాజెక్టును కట్టబెట్టేందుకు మార్గం సుగమమైందని, ఇందుకు టెండర్ల నిబంధనలు సైతం సదరు ముఖ్యనేతకు సంబంధించిన ఏజెన్సీకి అనుకూలంగా ఉండేలా రూపకల్పన జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారు 4 లక్షల 57 వేల స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను గడిచిన ఏడేండ్లుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదన్న సాకుతో ఆ సంస్థను జీహెచ్ఎంసీ తప్పించింది. ఎల్ఈడీ ప్రాజెక్టును గ్రేటర్లో తొలిసారిగా ప్రవేశపెట్టి ఏడేండ్ల నిర్వహణలో దాదాపు 5 ఏండ్లుగా సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి విద్యుత్ ఆదా రికార్డు స్థాయిలో తగ్గించినా.. సదరు ఈఈఎస్ఎల్ను గడిచిన రెండేండ్ల కాలంలో పొమ్మనలేక పొగబెట్టారన్న ప్రచారం సాగింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనం తర్వాత ఔటర్ వరకు మూడు ట్రై కార్పొరేషన్ల పరిధికిగానూ రూ.1341.6 కోట్లతో ప్రతిపాదనను చకచకా సిద్ధం చేయడం, వెంటనే ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక నిర్మాత, ముఖ్యనేత అనుచరుడు (గతంలో నిర్మాత) అన్నీ తానై తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వీధి దీపాల నిర్వహణను రాబోయే పదేండ్ల కాలానికి సమగ్ర నిర్వహణ, మరమ్మతుల కాంట్రాక్టును ఒక్క ఏజెన్సీకే అప్పగించేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నివారణలో వీధి దీపాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షణ, స్మార్ట్ గవర్నెన్స్‌లో భాగంగా సరికొత్త టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. ప్రతిపాదనల్లో భాగంగా ఏ ఒక ప్రాంతంలోనూ చీకటి ఉండకుండా, నిరంతరాయంగా దీపాలు వెలిగేలా చూడటం, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను గరిష్ఠంగా 48 గంటల వ్యవధిలోనే పరిషరించేలా నిబంధనలు రూపొందించారు. కేవలం ఎల్ఈడీ బల్బులే కాకుండా, సీసీఎంఎస్ ప్యానళ్లు, పోల్-టు-పోల్ కేబులింగ్, ఎర్తింగ్ సిస్టమ్స్, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మార్పిడి వంటివన్నీ ఈ కాంట్రాక్టు పరిధిలోకి వస్తాయి. సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎకడ దీపాలు వెలుగుతున్నాయి? ఎకడ సాంకేతిక లోపాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు పదేండ్ల సుదీర్ఘ కాలపరిమితి వల్ల కాంట్రాక్టు ఏజెన్సీలకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనలో స్థిరత్వం ఉంటుందని పేర్కొంటూ.. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే సదరు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల్లోనూ మతలబు దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ మెటీరియల్ ఇస్తే సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వహణ చేపట్టేది.
కానీ ఈ నూతన ప్రాజెక్టుకు మాత్రం నిబంధనలు అడ్డగోలుగా సవరించినట్లు తెలుస్తున్నది. మెటీరియల్ ఏజెన్సీకి ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చును భారీగా పెంచినట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో అనుభవం, టర్నోవర్ వంటి కఠిన నిబంధనలు ఉంటాయి. కానీ సదరు ముఖ్యనేత అనుచరుడి ఒత్తిడితో టెండర్ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అన్నింటికి మించి అనుభవం లేని సంస్థకు ఈ ప్రాజెక్టును ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఎవరికి దకుతుందో టెండర్ రాకముందే ఖరారైపోయినప్పుడు ఇక ఈ ప్రక్రియ అంతా ప్రహసనమేనని కొందరు బల్దియా వర్గాలు సైతం లోలోపల వాపోతున్నాయి. ఈఈఎస్ఎల్ వంటి జాతీయ స్థాయి సంస్థలు నిర్వహించిన పనుల్లోనే సమస్యలు తలెత్తగా, ఇప్పుడు 7.60 లక్షల వీధి దీపాల నిర్వహణను కేవలం ఒకరిద్దరికి మేలు చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.