హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : మాదిగ సమాజ హక్కుల సాధన కోసం దండోరా ఉద్యమం నిరంతరం పొరాట పథంలో ముందుకు సాగుతుంది అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన విషయంలో స్పష్టమైన పోరాటం చేసి, వాటిని సాధించుకొన్నామని గుర్తుచేశారు. మాదిగ హక్కులకు ఎక్కడ నష్టం జరిగినా వివిధ రకాల పద్ధతుల్లో మాదిగ హక్కుల దండోరా తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్నదని తెలిపారు. మాదిగల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన వంటి అంశాలపై ఉద్యమం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు.