ఇల్లెందు, ఆగస్టు 14 : ఇల్లెందు పట్టణంలో రూ.37.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఇల్లెందులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలనతో పాటు ఇల్లందు చెరువులో నీటి నిల్వలు, సుందిమళ్ల టీజీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఆయా అంశాలపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నూతన వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఇల్లెందు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిర్మాణ సంస్థ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఇదే క్రమంలో ఇల్లెందులపాడు మంచినీటి చెరువును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చెరువులోని ప్రస్తుత నీటిమట్టం, నీటి నిల్వ, పూర్తి స్థాయి నీటిమట్టం, గరిష్ట నీటిమట్టం, రోజువారీ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న నీటి పరిమాణం, నీటి డిశ్చార్జ్ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలను తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సూచించారు. రొంపేడు, చల్లసముద్రం తదితర ప్రాంతాల్లో చెరువుల నీటితో సాగు చేస్తున్న పంటలు, సాగు విస్తీర్ణం, సాగునీటి లభ్యత తదితర వివరాలను తెలుసుకున్నారు.

డిసెంబర్ నాటికి వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావాలి : కలెక్టర్ అంకిత్
అనంతరం విద్యా సంస్థల పనితీరుపై దృష్టి సారించిన కలెక్టర్, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని సుందిమళ్ల టీజీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, విద్యాబోధన, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, వసతి, భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో పఠన అలవాట్లు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందేలా అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించేలా చూడాలని సూచించారు. పాఠశాల భవనంలో వర్షాకాలంలో లీకేజీ సమస్యతో పాటు భోజనశాలలో కూడా లీకేజీలు ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట తాసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ సందీప్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హర్షవర్ధన్, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.