న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఫొటోలను తీసి భూమికి పంపడమే కాకుండా అంతరిక్షంలోనే వాటిని విశ్లేషించగల మొట్టమొదటి ఉపగ్రహాన్ని భారత్ అంతరిక్షంలోకి పంపింది. హైదరాబాద్కు చెందిన టెక్ మీ టూ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ ట్రాన్స్పోర్టర్-18 మిషన్ ద్వారా తన ఎంవోఐ-1ఏ ఉపగ్రహాన్ని గురువారం రాత్రి 11.48 గంటలకు ప్రయోగించింది.
అనవసరమైన డాటాను తొలగించి, కేవలం ఉపయోగకరమైన సమాచారాన్ని మాత్రమే భూమికి పంపగల సామర్థ్యం ఏఐకి ఉంటుందని కంపెనీ సీఈవో రౌనక్ కుమార్ సమంతరాయ్ తెలిపారు. ఉదాహరణకు, ఒక ఉపగ్రహం 300 బీజీ డాటాను సేకరించి అందులో కొంత భాగం మాత్రమే అవసరమైతే, ఏఐ ఆ భాగాన్ని వేరు చేసి పంపగలదు.
ఇది భూమికి చిత్రాలు, డాటాను పంపడంలో అయ్యే సమయం, ఖర్చును తగ్గించగలదు. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటల్ కంప్యూటింగ్ ఉపగ్రహం. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత ఈ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం ఉపగ్రహం నుంచి వచ్చే డాటా మొదట భూమికి చేరుకుంటుంది. ఆ తర్వాత దానిని పరిశీలించి, విశ్లేషిస్తారు. ఈ సాంకేతికతను వరదలు, అడవులు, పంటలు, గనుల ప్రాంతాలు, సరిహద్దులు, భూమిని పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చు.