హైదరాబాద్, (నమస్తే తెలంగాణ, అక్టోబర్ 2)/న్యూఢిల్లీ : భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటుకంటే 12.6 శాతం తక్కువగా ఉంది. 2015 తర్వాత ఇదే అత్యంత బలహీన రుతుపవనంగా నిలిచింది. అత్యల్ప, అస్తవ్యస్త వర్షాలు రైతుల ఆదాయంతో పాటు అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హర్యానాలోని కర్నాల్, ఘరౌండా ప్రాంతాల్లో రైతులు వరి పంటను మార్కెట్లకు తీసుకువస్తున్నారు.
అయితే ఈ సారి దిగుబడులు తగ్గడంతోపాటు, పురుగుమందులు, ఎరువులు, డీజిల్, వ్యవసాయ పరికరాల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. పంట ఆదాయం తగ్గడంతో రైతులు ట్రాక్టర్లు, బంగారం, గృహోపకరణాల వంటి పెద్ద కొనుగోళ్లను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది. ఘరౌండాలో ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు విక్రయించే సత్పాల్ ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో కేవలం ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించానని తెలిపారు. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ అమ్మకాల వార్షిక వృద్ధి ఆగస్టులో 0.8 శాతానికి పడిపోయింది.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం బలంగా ఉందని వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ పేరొన్నారు. నవంబర్ చివరి వరకు బలంగా కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే దాని ప్రభావాలు 2027 మార్చి వరకు కొనసాగవచ్చని వివరించారు. ప్రస్తుతం ఎల్ నినో తటస్థ స్థితికి దగ్గరగా ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో పాజిటివ్ దశకు మారే అవకాశం ఉందని అంచనా వేశారు. తుపానులు దక్షిణ దిశగా ఏర్పడే అవకాశాల నేపథ్యంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలపై వాటి ప్రభావం తకువగా ఉండవచ్చని మహాపాత్ర తెలిపారు.