లక్నో : ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో భారీ డీజే శబ్దాలకు 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతిగదిలోనే కుప్పకూలి చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వాలు ఎందుకు నియత్రించట్లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 22న స్కూల్ ముందు నుంచి వెళ్తున్న ఊరేగింపులో భారీ డీజే శబ్దాలు రావడం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ స్కూల్ యాజమాన్యం ఆరోపించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీజే శబ్దాల కారణంగానే విద్యార్థిని చనిపోయిందని తాము నిర్ధారించలేమని జస్టిస్ రాజస్ రాయ్, జస్టిస్ మంజీప్ శుక్లాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే అత్యధిక డెసిబుల్ స్థాయిలో డీజే శబ్దాలు వినిపించడంతోనే చిన్నారి చనిపోయింది కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి కేసును స్వీకరించామని ధర్మాసనం వెల్లడించింది.