న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు మూడో వంతు కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) అక్టోబర్ ఒకటిన వెల్లడించిన వివరాల్లో తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం ఎన్నికల సంఘానికి మొత్తం సుమారు 13,000 దరఖాస్తులు అందాయి.
జార్ఖండ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం జూన్ 30న ప్రారంభమైంది. ఇప్పటివరకు 43.6 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు లేదా తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మార్పులు, చేర్పుల తరువాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. కాగా ఒక్క ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల లిస్టు నుంచి పేర్ల తొలగింపునకు ఏకంగా 4,790 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రం మెత్తం మీద వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఇవే 36 శాతం కావడం గమనార్హం.
ప్రస్తుతం ఈ స్థానానికి ఎల్జేపీ(రామ్‌విలాస్) పార్టీ ఎమ్మెల్యే జనార్దన్ పాశ్వాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో 18,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాగా ఛత్రా నియోజకవర్గం లెక్కలను అధికారులతో సరిచూశామని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని రాష్ట్ర సీఈవో కే రవి కుమార్ స్పష్టం చేశారు.