రామగిరి, ఆగస్టు 14 : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాఘవేంద్ర సింగ్ నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయ నిర్వహణను, అక్కడ అందుతున్న సేవలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. గ్రంథాలయానికి విచ్చేసిన పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థుల అవసరాలను గుర్తించిన డాక్టర్ రాఘవేంద్ర సింగ్ వారికి అత్యంత ఉపయోగకరమైన పలు పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లోనూ గ్రంథాలయ అభివృద్ధికి, పాఠకులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను సమకూర్చడంలో తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ రాఘవేంద్ర సింగ్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.