హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : కేపీహెచ్బీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో మరోసారి రికార్డు ధరలు పలికాయి. ఈ వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలు పలికింది. భారీ సంఖ్యలో బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు. దీంతో ఈ వేలం ద్వారా రూ. 24.26 కోట్ల ఆదాయం హౌసింగ్ బోర్డుకు లభించింది. ఫేజ్-1, 2లోని ధర్మారెడ్డి కాలనీలోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్-15లోని సంపూర్ణం అపార్ట్మెంట్లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు.
మొత్తం 40 మంది ఈ వేలంలో పాల్గొన్నారు. ఎల్ఐజీ కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ.1.30 లక్షలు నిర్ధారించగా, గజం రూ. 2.65 లక్షలకు అమ్ముడుపోయింది. మరో ప్లాట్ గజం రూ. 2.41 లక్షలకు కొనుగోలు చేసినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.